పవన్ కల్యాణ్ పై సీనియర్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!?

Chakravarthi Kalyan
విజయశాంతి.. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలను సీరియస్ గా తీసుకోని కొందరు సినీ నటుల్లో విజయశాంతి ఒకరు. ఆమె ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారంటే.. ఒక్కసారిగా చెప్పడం కష్టం. అన్ని పార్టీలు ఆమె మారారు. చివరకు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నా.. ఇటీవలి కాలంలో ఆమె క్రియాశీలకంగా లేనేలేరు. కానీ మళ్లీ ఎన్నికల సమయం దగ్గగరకొస్తోంది కదా.. అందుకేనేమో మరోసారి ఆమె రాజకీయాల్లో తళుక్కుమన్నారు. 


రీ ఎంట్రీ ఇస్తూనే ఆమె తెలంగాణలో పర్యటిస్తున్న తోటి నటుడు పవన్ కల్యాణ్ పై విమర్శల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో టీఆర్ఎస్ పాలనపై తీవ్ర అసంతృప్తి నెలకొంటే.. పవన్  కల్యాణ్ కేసీఆర్ పాలన బావుందని చెప్పడం విడ్డూరంగా ఉందని విజయశాంతి అన్నారు. సీఎం కేసీఆర్ పాలన ఎక్కడ స్మార్ట్‌గా ఉందో చెప్పాలని పవన్ కల్యాణ్‌ను విజయశాంతి ప్రశ్నించారు. పవన్ రెండు కళ్ల సిద్ధాంతం తెలంగాణలో పని చేయదంటూ ఆయన తీరును తప్పుబట్టారు. 


పవన్ కల్యాణ్ వెళ్లి ఆంధ్రాలో రాజకీయాలు చేసుకోవాలని.. ఇక్కడి ప్రజలకు పవన్ కల్యాణ్ సేవలు అంతగా అవసరం లేదని విజయశాంతి అభిప్రాయపడ్డారు. తెలంగాణలో చిరంజీవికే దిక్కులేదని.. ఇక పవన్ కళ్యాణ్‌ను ఎవరు పట్టించుకొంటారని విజయశాంతి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఏపీ రాష్ట్రంపై కేంద్రీకరిస్తే ప్రయోజనం ఉంటుందన్నారు. ఏపీలో అనేక సమస్యలు ఉన్నాయని.. ప్రత్యేక హోదా విషయమై పవన్ పోరాటం చేయాలని విజయశాంతి సూచించారు.


పవన్ కల్యాణ్, కేసీఆర్ మధ్య రహస్య ఒప్పందం కుదిరి ఉండొచ్చని విజయశాంతి అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆర్ పదవి చేపట్టిన మొదట్లో ఆయన్ను విమర్శించిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు పొగడటంలో రహస్యం అదేనని విజయశాంతి అన్నారు. త్వరలోనే అన్ని రహస్యాలు బయటకు వస్తాయని ఆమె జోస్యం చెప్పారు. తాను తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్లే ప్రసక్తే లేదని విజయశాంతి స్పష్టం చేశారు. త్వరలో పార్టీలో క్రియా శీలకంగా పనిచేస్తానంటున్న విజయశాంతి.. అధిష్టానం ఏం చెప్పినా చేయడానికి తాను సిద్ధమన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: