మూడంచెలే ముద్దు

Narayana Molleti

వాళ్లు రాజకీయ నేతలు. పదవుల్లో ఉన్నారు. కానీ.. పనులు చేయించడానికి వారి వద్ద నిధులు ఉండవు. పని చేయడానికి విధులూ ఉండవు..! పంచాయతీరాజ్ వ్యవస్థలోని ఎమ్పీటీసీ, జెడ్పీటీసీల పరిస్థితి ఇది. మరి విధులు, నిధులు లేని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ప్రస్తుతం అవసరమా? చేతికి ఆరో వేలుగా మారిన ఈ వ్యవస్థతో ఒనగూరే ప్రయోజనం ఎంత? ప్రజలకు పాలన చేరువ చేయడం కోసం.. స్థానిక నాయకత్వాన్ని బలపరచడం కోసం.. ప్రారంభమైన ఈ వ్యవస్థ వల్ల లాభమా..? నష్టమా..? వాటిని రద్దు చేస్తారా..? ఆ అధికారం రాష్ట్రానికి ఉందా..? ఇదీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న హాట్ హాట్ చర్చ.


పంచాయతీరాజ్‌ వ్యవస్థలో గతంలో ఉన్న మూడంచెల విధానానికే ముఖ్యమంత్రి చంద్రబాబు మొగ్గు చూపుతున్నారు. ఎలాంటి విధులు, అధికారాలు, నిధులు లేని ఎంపీటీసీ, జడ్పీటీసీల వ్యవస్థ నిరర్ధకమని భావిస్తున్నారు. ఆరో వేలు మాదిరిగా ఉన్న ఈ వ్యవస్థకు చరమ గీతం పాడాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. అన్నీ కుదిరితే.. వచ్చేసారి జడ్పీటీసీ, ఎంపీటీసీల ప్రస్తావన లేకుండానే పంచాయతీరాజ్‌ పరిధిలోని స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వంలోని ఉన్నతాధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.


ప్రస్తుతం రాష్ట్రంలోని పంచాయతీరాజ్‌ వ్యవస్థలో ఐదంచెల విధానం కొనసాగుతోంది. సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యత్వానికి ప్రత్యక్ష పద్ధతిలో, మండల, జిల్లా పరిషత్ అధ్యక్ష ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరుగుతున్నాయి. షెడ్యూల్‌ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో 2019 మార్చి, ఏప్రిల్‌ నెలల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగాలి. పంచాయతీరాజ్‌ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురాకపోతే ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని రెండు రాష్ట్రాలూ అంటున్నాయి. ప్రస్తుతమున్న గందరగోళ వ్యవస్థల్ని సవరిస్తే తప్ప ఎన్నికలు సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నాయి.


మన రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ గత చరిత్రను ఒకసారి పరిశీలిస్తే.. 1967 కంటే ముందు పంచాయతీరాజ్‌ వ్యవస్థలో బ్లాకులు ఉండేవి. వాటికి ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగేవి. జిల్లా పరిధిలోని బ్లాక్‌ అధ్యక్షులంతా కలిసి జడ్పీ అధ్యక్షుడిని పరోక్ష పద్ధతిలో ఎన్నుకునేవారు. తర్వాత పంచాయతీ సమితులు వచ్చాయి. ఒక సమితి పరిధిలోని సర్పంచ్‌లు సమితి అధ్యక్షుడిని, ఒక జిల్లాలోని సమితి అధ్యక్షులంతా కలిసి జడ్పీ అధ్యక్షుడిని పరోక్ష పద్ధతిలో ఎన్నుకునేవారు.


ఎన్టీఆర్‌ 1982లో అధికారంలోకి వచ్చాక, 1985లో మండల వ్యవస్థను తీసుకొచ్చారు. తొలిసారి 1987లో మండల, జడ్పీ అధ్యక్ష పదవులకు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగాయి. సర్పంచ్‌లు మండల పరిషతలో.. ఎంపీపీలు జడ్పీలో సభ్యులుగా ఉండేవారు. కాగా 1994 నుంచి మండల, జడ్పీ అధ్యక్ష ఎన్నికలను పరోక్ష పద్ధతిలో నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు ఆలోచనలు అమల్లోకి వస్తే.. మండల పరిషత, జడ్పీ చైర్మన్‌ పదవులకు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. ఇందుకు సంబంధించి రూపొందించే విధివిధానాలు కొలిక్కి వస్తేనే స్పష్టత వస్తుందని ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి.


ఇతర రాష్ట్రాల మాట ఎలా ఉన్నప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్‌ వ్యవస్థ బలంగానే ఉండేది. 1992లో తీసుకువచ్చిన 73వ రాజ్యాంగ సవరణ స్థానిక సంస్థలను బలోపేతం చేసేలా ఉన్నప్పటికీ ఆచరణలోకి వచ్చేసరికి అస్తవ్యస్తంగా తయారయింది. కొండనాలుకకి మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లు వ్యవస్థను బలోపేతం చేయాలనుకుంటే అదికాస్తా మరింత గందరగోళానికి దారితీసింది. నిజానికి దేశవ్యాప్తంగా అత్యధిక రాష్ట్రాల్లో మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థ అమల్లో ఉండేది. అయితే.. మండల, జిల్లా స్థాయి పంచాయతీరాజ్‌ సంస్థలకు పరోక్ష ఎన్నికలు ఉండాలన్న నిబంధనతో కొత్త సమస్య వచ్చి పడింది. ఉన్న మూడంచెలకు అదనంగా ఆరో వేలువంటి ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సి వచ్చింది.


వాస్తవానికి.. కేవలం రాజకీయ పునరావాసం కోసం తప్ప ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవులు ఎందుకూ పనికిరావు. పైగా స్థానికంగా అధికారాలు, నిధుల కోసం పోరాటాలు ఎక్కువయ్యాయి. మండల, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు జరిపితే వీటి అవసరం ఉండేది కాదు. పరోక్ష ఎన్నికలు జరపాలని నిర్దేశించడంవల్లే ఈ సమస్య వచ్చి పడింది. మండల పరిషత్‌లో సర్పంచ్‌ సభ్యుడైతే ఆ పరిషత్‌ అధ్యక్షుడిగా కూడా ఎన్నిక కావచ్చు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా కూడా అర్హుడే అవుతాడు. ఇది ఆచరణలో అసాధ్యం. అదే ప్రత్యక్ష ఎన్నికలైతే మండల, జిల్లా పరిషత్‌ చైర్మన్లను ప్రజలు నేరుగా ఎన్నుకొంటారు. సభ్యులు దిగువ సంస్థల నుంచి వస్తారు. కానీ రాజ్యాంగం మాత్రం పరోక్ష ఎన్నికలు జరపాలని చెప్పడంతో కేవలం మండల పరిషత్‌ చైర్మన్‌ను ఎన్నుకోవడానికి ఎంపీటీసీలను.. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ను ఎన్నుకోవడానికే జడ్పీటీసీలను సృష్టించాల్సి వచ్చింది.


ఈ విధానంపై పలు రాష్ట్రాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఇన్ని వ్యవస్థలు అవసరం లేదని, వాటిని రద్దు చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సహా అనేక రాష్ర్టాలు కేంద్రంపై ఒత్తిడి పెంచాయి. దీంతో ఎన్డీయే ప్రభుత్వం మురళీ మనోహర్‌ జోషి నేతృత్వంలో పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ తన సిఫారసులను అందజేసింది. దేశ ప్రయోజనాల దృష్ట్యా శాసన సభకు, లోక్‌ సభకు కలిపి ఎన్నికలు జరిపి అదే సమయంలో స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు జరపాలని సిఫారసు చేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ లాంటి అదనపు వ్యవస్థల నుంచి విముక్తి కలిగించడానికి మండల, జిల్లా పరిషత్‌ చైర్మన్లను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలని కూడా సూచించింది. దీనివల్ల రాజకీయ స్థిరత్వం ఉంటుందని సభ్యుల దయాదాక్ష్యిణ్యాల మీద ఆధారపడకుండా ఉండొచ్చని కమిటీ అభిప్రాయపడింది.


అయితే.. దీనికి రాజ్యాంగ సవరణ అవసరమైనందున కేంద్రం రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది. సగానికి పైగా రాష్ట్రాలు ఆమోదించినా కేంద్రం ముందడుగు వేయలేకపోతోంది. ఈ మార్పులు చేయాలంటే మూడింట రెండొంతుల మెజార్టీతో రాజ్యాంగ సవరణ చేయాలి. కాంగ్రెస్‌ తాను తెచ్చిన సంస్కరణలను మార్చడానికి ససేమేరా అంటుండడంతో జోషి సిఫారసులు ముందుకు కదలడం లేదు. రాజ్యాంగ సవరణ చేసి ఎంపీటీసీ, జడ్పీటీసీలను తొలగించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లడం వీలవుతుందని అలా కాదని ముందే ఎన్నికలకు వెళితే మరో ఐదేళ్ల వరకూ వాటిని కదిలించడం సాధ్యం కాదనేది తెలుగు రాష్ట్రాల భావన.


నిధులు, విధులు లేవన్న మాట నిజమే అయినా.. ఈ వ్యవస్థ వల్ల స్థానిక నాయకత్వం బాగా బలపడిందనేది కాదనలేని వాస్తవం. మండల పరిషత్‌, జిల్లా పరిషత్ లు అమల్లోకి వచ్చిన తరువాత గ్రామ స్థాయిలో కొత్త నాయకత్వం తెరపైకి వచ్చింది. ప్రత్యక్ష ఎన్నికల్లో ఎంపీపీలుగా బాధ్యతలు స్వీకరించిన వారు నాయకత్వ లక్షణాలను పెంచుకున్నారు. తెలుగు నేలపై ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులుగా ఎదిగిన నాయకులు ఎంతోమంది ఉన్నారు.పంచాయతీరాజ్‌లో ఐదంచెల వ్యవస్థను రద్దు చేసి పాత విధానంలో మూడంచెల వ్యవస్థను అమలు చేయడం సాధ్యమేనా అనేది ప్రశార్థకంగా మారింది. 1999 – 2000 సమయంలో ఎంపీటీసీలు, జడ్పీటీసీల వ్యవస్థను రద్దు చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో ప్రయత్నించింది. 2019 మే లోపు ఎంపీటీసీ, జడ్పీటీసీల వ్యవస్థను రద్దు చేయించడానికి టీడీపీ ప్రభుత్వం ఇప్పటి నుంచే ప్రయత్నిస్తోంది. అయితే ఇది ఎంతవరకు సాధ్యపడుతుందనేదానికి కాలమే సమాధానం చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: