జయలలిత సమాధికి నమస్కరించి..నామినేషన్ సమర్పించిన విశాల్..!

siri Madhukar

తమిళ ఇండస్ట్రీలో గత కొంత కాలంగా ఎన్నో సంచలనాలకు తెరలేపిన  సినీనటుడు నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ ఇప్పుడు మరో సంచలనానికి నాంది పలికారు.  ఆర్కేనగర్ ఉపఎన్నికలో పోటీచేయనున్నట్లు మీడియా ద్వారా ప్రకటించిన   విశాల్ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు మధ్యాహ్నం విశాల్ తన పోటీకి సంబంధించిన నామినేషన్ పత్రాలను సమర్పించారు.తమిళనాడు రాజకీయాల్లో ప్రతిష్టాత్మకంగా మారిన ఆర్కే నగర్ నియాజకవర్గం ఎన్నికలు డిసెంబర్ 21న జరగనున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే ఈ ఎన్నికల్లో అధికార పార్టీ అన్నాడీఎంకే , ప్రతిపక్ష పార్టీ డీఎంకే తమ అభ్యర్థులను ప్రకటించేసాయి. 


తమిళ నటుడు విశాల్ కూడా ఈ ఎన్నికల బరిలోకి దిగుతుండడంతో ఈ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయని చెప్పాలి.. సామజిక కార్యక్రమాల్లో ముందుండే విశాల్ కు ఆ కోణం ఈ ఎన్నికల్లో కలిసొచ్చే అవకాశముంది.   ఈ నేప‌థ్యంలోనే విశాల్ జ‌య‌ల‌లిత స‌మాధి వ‌ద్ద నివాళుల‌ర్పించి, నామినేష‌న్ సెంట‌ర్‌కు వెళ్లి నామినేషన్‌ దాఖలు చేశాడు.విశాల్ నామినేష‌న్ వేసిన ఆ సెంటర్‌లో ఇతర స్వతంత్ర్య అభ్యర్థులు నామినేషన్‌ వేసేందుకు త‌మ మ‌ద్ద‌తుదారులతో అక్క‌డికి చేరుకున్నారు. 


అన్నాడీఎంకే తరపున మధుసూద‌నన్ బ‌రిలోకి దిగుతుండ‌గా, శశికళ వర్గం నుంచి దినకరన్, డీఎంకే అభ్యర్థిగా మరుదు గణేశ్, స్వతంత్రుడిగా విశాల్ ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్నారు.  స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న విశాల్ కు ఈ ఎన్నికల్లో ఫలితం ఎలా ఉండబోతుందో..? ఈ ఎన్నికల ఫలితం డిసెంబర్ 24న వెలువడనుంది.  


ఈ ఉప ఎన్నికల బరిలోకి దిగుతున్న సందర్భంగా విశాల్ మీడియాతో మాట్లాడుతూ అమ్మ ఆశయాలకు అనుగుణంగా పని చేసేందుకు ఓ అవకాశం ఇవ్వాలని ఆర్కే నగర్ ప్రజలను కోరారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తనకు ఆదర్శమని విశాల్ వెల్లడించారు. హీరోగానే కాకుండా నడిగర్ సంఘం అధ్యక్షుడిగా సినీ రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నాడు. ఈ నెల 21న ఆర్కేనగర్ లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం కారణంగా ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: