టీడీపీతోనే మళ్లీ బీజేపీ పొత్తు..! ఆ పార్టీతో ముప్పేమీ లేదనుకుంటున్న మోదీ..!!

Vasishta

ఆంధ్రప్రదేశ్ లో బలమైన పార్టీగా ఎదగడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. తెలుగుదేశం పార్టీతో కలిసి అధికారంలో ఉన్న బీజేపీ.. పార్టీపరంగా ఇంకా ఎంతో వెనుకబడి ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎదగడానికి ఎంతో స్కోప్ ఉందని భావిస్తున్న అధిష్టానం.. అందుకు తగ్గట్టు వ్యూహరచన చేస్తోంది.


          బీజేపీ అధికార ప్రతినిధి మురళిధర రావు ఉత్తరాంధ్రలో పదాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం టీడీపీతో కలిసి అధికారంలో ఉన్న బీజేపీ.. ఇప్పటికప్పుడు ఆ పార్టీతో వచ్చిన ముప్పేమీ లేదని స్పష్టంచేశారు మురళీధర్ రావు. అదే సమయంలో తమ పార్టీ ఎదగడానికి కూడా ఎంతో స్కోప్ ఉందని ఆయన వెల్లడించారు.


          ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏపీలో గల్లంతైంది. టీడీపీ బలమైన పార్టీగా ఉంది. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నా.. ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో ఇంకా పటిష్ట నిర్మాణంలేదని బీజేపీ అంచనా వేస్తోంది. ఆ స్థానాన్ని కైవసం చేసుకోవడం ద్వారా తమ పార్టీకి పటిష్టమైన పునాదులు వేసుకోవచ్చని ప్లాన్ వేస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉండడం, ప్రతిపక్ష కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉండడంతో తమ ఎదుగుదలకు ఎన్నో అవకాశాలున్నాయనేది బీజేపీ నేతల ఆలోచన.


          టీడీపీతో కలిసి అధికారం పంచుకుంటూనే వ్యక్తిగతంగా పార్టీ పటిష్టతకోసం పాటుపడాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇందుకోసం తొలుత టీడీపీయేతర పార్టీల్లోని బలమైన నేతలను టార్గెట్ చేస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్, వైసీపీల్లో కొంతమంది బలమైన నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు. వారిని ఆహ్వానించడం ద్వారా బలపడాలని యోచిస్తోంది. 2014 ఎన్నికలకు ముందు బీజేపీ ఏపీలో నామమాత్రంగా ఉండేది. అయితే ఆ సమయంలో పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పురంధేశ్వరి, కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మినారాయణ.. తదితరులు బీజేపీలో చేరారు. తద్వారా కాస్త పుంజుకుంది. ఇప్పుడు ఇదే స్ట్రాటజీ అమలు చేయాలనుకుంటోంది.


          వచ్చే ఎన్నికలనాటికి టీడీపీతో కలిసి పోటే చేసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని పార్టీ శ్రేణులకు బీజేపీ అధిష్టానం సూచనప్రాయంగా వెల్లడించింది. అయితే వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలనుకుంటోంది. అందుకే బలం పెంచుకుని డిమాండ్ చేసే లక్ష్యంతో పనిచేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: