సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరిలో పొలిటికల్‌ సీన్‌ ఎలా ఉంది?

Chakravarthi Kalyan
హైదరాబాద్‌.. ఇది నిన్నటి వరకూ బీఆర్‌ఎస్‌కు కంచుకోట. అయితే అది అసెంబ్లీ ఎన్నికల వరకు.. కానీ ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలతో సీన్ మారింది. జనం మూడ్‌ కూడా మారుతోంది. పార్లమెంట్ ఎన్నికలు కావడంతో జాతీయస్థాయిలో జనం ఆలోచిస్తున్నారు. మరి ఇక్కడ సీన్‌ ఎలా ఉంది. బీఆర్‌ఎస్‌ పట్టు నిలుపుకునేందుకు ఎలా ప్రయత్నిస్తోంది..  ఓసారి పరిశీలిద్దాం..

శాసనసభ ఎన్నికల్లో హైదరాబాద్‌తోపాటు శివారు నియోజకవర్గాలు బీఆర్‌ఎస్‌కు పూర్తి అండగా నిలిచాయి. మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో మెజార్టీ అసెంబ్లీ స్థానాలను గులాబీ పార్టీ దక్కించుకొంది. మల్కాజ్‌గిరిలో ఏడింటికి ఏడు చోట్ల బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందారు. సికింద్రాబాద్ పరిధిలో ఒక్క నాంపల్లి మినహా ఆరు స్థానాల్లో కారు విజయం సాధించింది. చేవెళ్ల పరిధిలోని నాలుగు సీట్లలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులే నెగ్గారు.

అయితే..  ఖైరతాబాద్‌లో గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరి సికింద్రాబాద్‌లో ప్రత్యర్థిగా మారారు. మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ బీఆర్‌ఎస్‌తోనే ఉన్నారు. ఈ మూడు లోక్‌సభ స్థానాలపై బీఆర్‌ఎస్‌ నాయకత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది.  మూడు నియోజకవర్గాల నేతలతో కేటీఆర్ తరచూ సమీక్షిస్తూ క్షేత్రస్థాయి పరిస్థితిని ఆరా తీస్తున్నారు. ఎప్పటికప్పుడు వస్తున్న సమాచారం ఆధారంగా నేతలను అప్రమత్తం చేస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు.

ఇక అధినేత కేసీఆర్ సైతం ఇక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. నోటిఫికేషన్‌కు ముందే కేసీఆర్ చేవెళ్లలో బహిరంగ సభ నిర్వహించారు. మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల లోక్‌సభ స్థానాల పరిధిలో పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ ఇప్పటికే ప్రచారం కొనసాగిస్తున్నారు. విస్తృతస్థాయి సమావేశాలతోపాటు రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి అండగా నిలిచిన నగరవాసులకు ధన్యవాదాలు చెబుతూ.. లోక్‌సభ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరుతున్నారు. పదేళ్లలో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ మద్దతు అడుగుతున్నారు. గురువారం సికింద్రాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్‌లో, మల్కాజ్‌గిరి పరిధిలోని కూకట్‌పల్లిలో కేటీఆర్‌ రోడ్ షోలలో పాల్గొన్నారు. రేపు మేడ్చల్, మల్కాజ్‌గిరి, కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో... కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఆదివారం ఎల్బీనగర్, ఉప్పల్, అంబర్‌పేట్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

brs

సంబంధిత వార్తలు: