తిరుమల లడ్డూకు లైసెన్స్..! ఇకపై అన్ని వస్తువుల్లో అదీ ఒకటే..!?

Vasishta

తిరుమల లడ్డూ తయారీకి టీటీడీ అనుమతి పొందింది. లడ్డూ తయారీకి అవసరమైన నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నందుకు ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి ఈ లైసెన్స్ దక్కించుకుంది. లడ్డూను వస్తువులా చూడకుండా ప్రసాదంలా చూడాలని గతంలో లైసెన్స్ నిరాకరించిన టీటీడీ.. ఇప్పుడు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా అనుమతి తీసుకుంది. లైసెన్స్ పొందడం వల్ల లడ్డూను కూడా ఓ వస్తువుగా పరిగణించాల్సి ఉంటుంది.


సాధారణంగా ఏదైనా వస్తువును మార్కెట్లోకి విడుదల చేయాలంటే దాని తయారీవిధానం, నాణ్యతను పరిగణనలోకి తీసుకుని అనుమతిస్తారు. ఆహార పదార్థాలకు సంబంధించి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా లైసెన్స్ లను మంజూరు చేస్తుంటుంది. నిర్దేశిత ప్రమాణాలను పాటించి తయారు చేసే వాటికి మాత్రమే ఈ అనుమతి లభిస్తుంది.


తిరుమల లడ్డూను వస్తువులా చూడకుండా ప్రసాదం చూడాలనేది టీటీడీ వాదన. ఇదే కారణంతో గతంలో లడ్డూ నాణ్యతను పరిశీలించేందుకు వచ్చిన ఫుడ్ సేఫ్టీ సంస్థ అధికారులను తిప్పి పంపింది. బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు లడ్డూ నాణ్యతపై ఫుడ్ సేఫ్టీ అథారిటీకి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదును స్వీకరించిన అధికారులు తనిఖీకి వస్తే టీటీడీ అనుమతించలేదు. భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా తిరిగి వెళ్లిపోయారు.


అయితే తాజాగా గుట్టు చప్పుడు కాకుండా తిరుమల లడ్డూకు టీటీడీ లైసెన్స్ పొందింది. లడ్డూ తయారీకి అవసరమైన భద్రత, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తుండడం వల్లే లైసెన్స్ మంజూరైనట్లు టీటీడీ తెలిపింది. లైసెన్స్ పొందడం వల్ల తిరుమల లడ్డూ అక్రమమని ఫిర్యాదులు చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే అన్ని వస్తువుల లాగే దీన్ని కూడా మార్కెట్లో అమ్ముకోవచ్చు.


అయితే లడ్డూ తయారీలో అన్ని రకాల నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నామని చెప్పడానికి మాత్రమే లైసెన్స్ తీసుకున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. అంతేకానీ లైసెన్స్ పొందినందువల్ల ప్రసాదాన్ని బహిరంగ మార్కెట్లో అన్ని వస్తువుల్లాగా అమ్మి సొమ్ము చేసుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: