రేపే కాకినాడకు కొత్త మేయర్..! ఎవరో తెలుసా..?

Vasishta

కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ పార్టీ తరపున ఎవరు మేయర్ స్థానంలో కూర్చోబోతున్నారనేదానిపైనే ఉత్కంఠ నెలకొంది. జనరల్ మహిళలకు రిజర్వ్ అయిన మేయర్ స్థానంలో కాపులను కూర్చోబెడతామని టీడీపీ ఇప్పటికే ప్రకటించింది. నలుగురు కాపు మహిళలు ఎన్నికల్లో గెలవడంతో వారిలో ఎవరిని మేయర్ పీఠం వరించబోతోందన్నది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది.


          కాకినాడ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక శనివారం జరగనుంది. కాకినాడ కార్పొరేషన్ లో మొత్తం 48 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. 32 స్థానాల్లో టీడీపీ, 10 స్థానాల్లో వైసీపీ, 3 చోట్ల బీజేపీ, మరో 3 చోట్ల టీడీపీ రెబెల్స్ గొలుపొందారు. సుమారు 20 ఏళ్ల తర్వాత కాకినాడ కార్పొరేషన్ ను టీడీపీ గెలుచుకుంది. దీంతో మేయర్ పీఠంపై కూర్చునేందుకు చాలా మంది ఆశపడ్డారు. అయితే ఎన్నికలకు ముందే కాపులకు ఈ పదవి ఇస్తామని టీడీపీ చెప్పడంతో గెలిచిన కాపులు దీనిపై మంతనాలు ముమ్మరం చేశారు.


          మొత్తం నలుగురు మహిళలు కాపు సామాజిక చెందినవారున్నారు. 8వ డివిజన్ నుంచి అడ్డూరి వరలక్ష్మి, 28వ డివిజన్ నుంచి సుంకర పావని, 38వ నుంచి మాకినీడి శేషుకుమారి, 40వ డివిజన్ నుంచి సుంకర శివప్రసన్న గెలుపొందారు. వీరిలో ఒకరికి పదవి వరించబోతోంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఇద్దరు మాత్రమే రేసులో నిలుస్తున్నట్టు తెలుస్తోంది. అడ్డూరి వరలక్ష్మి, సుంకర శివప్రసన్నలలో ఒకరిని మేయర్ పీఠం వరించబోతోందన్నది లేటెస్ట్ అప్ డేట్.


          న్యాయవాదిగా అడ్డూరి వరలక్ష్మి కాకినాడ ప్రజలకు సుపరిచితురాలు. శివప్రసన్న కూడా హ్యూమన్ రీసోర్స్ విభాగంలో ఎంబీఏ చేశారు. మేయర్ పీఠం కోసం వీరిద్దరూ గట్టిగానే పోటీ పడుతున్నారు. వీరిద్దరిపై స్థానిక నేతల అభిప్రాయాలను ఇప్పటికే పార్టీ సేకరించింది. శనివారంలోపు మరోసారి అభిప్రాయం సేకరించి ఒకరిని మేయర్ స్థానంలో కూర్చోబెట్టేందుకు అధిష్టానం చర్యలు తీసుకుంటోంది. మరోవైపు డిప్యూటీ మేయర్ పదవిని బీజేపీ ఆశిస్తోంది. అయితే బీజేపీకి ఆ పదవిని టీడీపీ ఇస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: