జేసీపై పెద్ద బాధ్యత పెట్టిన చంద్రబాబు.. ఏంటో తెలుసా..?

Vasishta

నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాలతో ఉరకేలేసే ఉత్సహాంతో ఉంది అధికార తెలుగుదేశం పార్టీ..! అదే జోష్ తో వచ్చే ఎన్నికల నాటికి ప్రతిపక్ష వైసీపీని సంస్థాగతంగా కోలుకోలేని దెబ్బతీసేందుకు వ్యూహరచన  చేస్తోంది.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నుంచి భారీగా వలసలను ప్రోత్సహించేందుకు టీడీపీ పెద్దలు అయా జిల్లాల్లోని ముఖ్యనేతలకు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అధికారపక్ష నేతలు వలసలతో ప్రతిపక్షానికి భారీ షాక్ ఇచ్చేందుకు రంగం సిద్దం చేసినట్లు కనిపిస్తోంది. భారీ రాజకీయ వలసలకు అనంతపురం జిల్లాను కేంద్రబిందువుగా చేసుకుంటున్నట్లు సమాచారం.


టీడీపీ శ్రేణులకు 2019 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు పెట్టిన టార్గెట్ 175 సీట్లు. అంటే క్లీన్ స్వీప్ అన్నమాట. రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేకుండా .. వార్ వన్ సైడ్ అన్నట్లు ఎన్నికలు జరిగేలా ప్రతిపక్షాలను సంస్థాగతంగా బలహీనపర్చడానికి తెలుగుదేశం భారీ వ్యూహారచన చేస్తోంది. అందులో భాగంగా అనంతపురం జిల్లా వైసీపీలో  ఉన్న ప్రతిపక్ష అసమ్మతివర్గాన్ని ఆకర్షించే బాధ్యతలు అనంతపురం ఎంపి జె.సి.దివాకర్ రెడ్డికి అప్పగించినట్లు కనిపిస్తోంది. జేసీ తనతో సన్నిహితంగా ఉండే వైసీపీ మాజీ ఎమ్మెల్ల్యే గురునాథ్ రెడ్డితో పాటు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్ల్యే కొట్రిక మధుసూదన్ గుప్తాతో నిత్యం టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది..


వారిద్దరూ పసుపు కండువాలు కప్పుకుంటే అనంతపురం పార్లమెంట్  సెగ్మెంట్లో జేసీ అధిపత్యానికి తిరుగుండదని అంచనా.. అందుకే వారి వలసలను ప్రోత్సహించే బాధ్యతను జేసీ తన భుజస్కంధాలపై వేసుకున్నట్లు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో అనంతపురం ఎంపీ స్ధానం నుంచి జేసీ తన తనయుడు పవన్ కుమార్ రెడ్డిని రంగంలోకి దించే ఉద్దేశంతో ఉన్నారు. అందుకే అనంతపురం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని వైసీపీ నేతలకు గాలం వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ క్రమంలో తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్న ప్రతిపక్షపార్టీ నేతలు బహిరంగ ప్రకటనలు చేయకుండా మౌనం వహిస్తున్నట్లు సమాచారం.


అయా నియోజక వర్గాల్లోని నేతలతో పాటు ద్వితీయశ్రేణి నేతలు, గ్రామస్ధాయినేతలను గంపగుత్తగా ఒకేసారి పార్టీలోకి ఆహ్వానించి వైసీపీకి ఝలక్ ఇవ్వాలని టీడీపీ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అంతేకాక ఇంతకాలం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన మాజీ ఎంపీ, వైసీపీ ముఖ్యనేత అనంత వెంకటరామిరెడ్దిపై అసమ్మతితో ఉన్న నేతలను ఏకకాలంలో టీడీపీలోకి రప్పించి.. రాజకీయంగా బలమైన ప్రత్యర్ధిని లేకుండా చూసుకోవడమే కాక.. ఆయన్ని ఒంటరిని చేయడానికి పావులు కదుపుతున్నట్లు సమాచారం..  


గత సాధారణ ఎన్నికల ముందు మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి చివరి నిముషంలో వైసీపీలోకి రావడంపై .. అప్పట్లో మాజీ ఎమ్మెల్ల్యే గురునాథరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య రాజకీయవైరం మరింత పెరిగి.. పరిస్థితి ఉప్పునిప్పులా మారింది.. అయితే ఇంతకాలం రాజకీయంగా తమను వెనకేసుకొచ్చే బలమైన నేత అండదండలు లేక స్తబ్ధుగా ఉన్న గురునాథరెడ్డి వర్గం.. ఇప్పుడు అందివచ్చిన అవకాశాన్ని అస్త్రంగా చేసుకొని జిల్లా వైసీపీలో చక్రం తిప్పుతున్న వెంకటరామిరెడ్డిని రాజకీయంగా కోలుకోలేని దెబ్బతీసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది..


అదీకాక తనను వ్యతిరేకించే  నేతలకు పార్టీలో ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారని వెంకటరామిరెడ్డిపై ఆరోపణలున్నాయి.. వారిని డమ్మీలను చేసి తాను వచ్చే ఎన్నికల్లో అనంతపురం నగర నియోజక వర్గం నుంచి ఎమ్మెల్ల్యేగా పోటీ చేయాలని ఆయన యోచిస్తున్నట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. అలా పార్టీలో ప్రాధాన్యత లేకుండాపోవడం.. వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్టు రావడం కష్టమని భావించిన మాజీ ఎమ్మెల్లే గురునాథరెడ్డి అధికార పక్షంలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అందుకు అతి దగ్గరలోనే ముహూర్తం కూడా ఫిక్స్ అయిందటున్నారు. ఒక్క అనంతలోనే కాదు అన్ని జిల్లాల్లోనూ టీడీపీ ఈ ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రయోగిస్తూ ఆయా బాధ్యతలను కీలక నేతలను అప్పగించినట్లు చెప్తున్నారు.. మరి టీడీపీ ఆపరేషన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో

వేచి చూద్దాం..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: