సింగిరెడ్డి నారాయణ రెడ్డి అంటే 'సినారె' ఈ రోజు ఉదయం మనల్ని విడిచి ఈ భువి నుంచి దివికి వెళ్ళిపోయారు. ఆ తెలుగు సాహితీ సుమ సౌరభ పరిమళాలు మందగించాయి. తెలుగు సాహిత్యానికి సాహితీ రంగానికి విశేషమైన సేవలందించిన సినారె నేటి ఉషోదయకాలం లో తుదిశ్వాస విడిచారు.
తెలుగు సాహిత్యానికి అసలు సిసలైన చిరునామా సినారే ఆ సాహుతీ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయటం లో ఆయనే సాహితీ సార్వబౌముడుగా నిలిచారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడ్తున్న ఆయన హైదరాబాద్లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
1953లో "నవమి పువ్వు" సినారె తొలి రచన. తెలుగు సాహిత్య అకాడమీ, జ్ఞానపీఠ్, పద్మశ్రీ, పద్మభూషణ్, ఇలా ఎన్నో పురస్కారాల్ని సొంతం చేసుకున్న 'సినారె'ని 'మహాకవి'గా అభివర్ణిస్తారు సాహితీ ప్రేమికులు. అవార్డులకే ఆయన వన్నె తెచ్చారు. 1988లో విశ్వంభర కావ్యానికిగానూ ప్రఖ్యాత జ్ఞానపీఠ్ పురస్కారాన్ని అందుకున్నారు. 1992లో పద్మవిభూషణ్ పురస్కారాన్ని పొందారు. 1997లో రాజ్యసభ సభ్యుడిగానూ ఎన్నికయ్యారు.
3500 పాటలు రాశారు సినారె. "ఆత్మబంధువు" నుంచి "అరుంధతి" దాకా ఆయన రాసిన ప్రతి పాటల్లో ఆణిముత్యాలే ఎక్కువ. "అనగనగా ఒక రాజు-అనగనగా ఒక రాణి" అంటూ ఆత్మబంధువు సినిమాలో సినారె రాసిన పాట అప్పటికీ, ఇప్పటికీ ఎప్పటికీ ఎవరూ మర్చిపోలేని ఆణిముత్యం. అది ఒక మరపు రాని క్లాసిక్. సినారె రాసిన ప్రతి పాటా అంతే.
కరీంనగర్ జిల్లా హనుమాజీపేటలో జన్మించిన సింగిరెడ్డి నారాయణరెడ్డి.. సినారెగా సాహితీలోకంలో తనదైన ముద్రలు వదిలి వెళ్లారు. నారాయణరెడ్డి మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. సినారె మరణంతో తెలుగు సాహితీ లోకం మూగ బోయిందని పలువురు సాహితీ వేత్తలు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు సినిమా పాటపై తనదైన ముద్ర వేసిన సినారె మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు అని పలువురు తెలుగు సినీ ప్రముఖులు వ్యాఖ్యానించారు. సినారె మరణం పట్ల తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి ని వ్యక్తం చేశారు.