ఢిల్లీలో పళని వర్సెస్ పన్నీరు...!!

Shyam Rao

తమిళనాడు రాజకీయాలు మరోసారి ఢిల్లీకి చేరాయి. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గీయులు ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రోజు (మంగళవారం) ఇరు వర్గాలు ఢిల్లీ పెద్దలను కలవనున్నారు. పళనిస్వామి తన వర్గం పార్లమెంట్ సభ్యులతో ప్రధాని నరేంద్ర మోదీ సహా, పలువురు కేంద్ర మంత్రుల బృందాలను కలవనుండగా, పన్నీస్ సెల్వం తన వర్గం ఎంపీలతో రాష్ట్రపతి ముందు తమ గోడును వెళ్లబోసుకోనున్నారు. 



దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అపొల్లో యాజమాన్యం అందించిన వైద్యం, ఆమె మృతికి గల కారణాలపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ వినతిపత్రం సమర్పించనున్నారు.  మధ్యాహ్నం 1:30 గంటలకు పన్నీరు సెల్వం వర్గం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనుంది. ఈ మేరకు వారు అపాయింట్‌మెంట్‌ తీసుకున్నారు. తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలని పన్నీరు సెల్వం వర్గం కోరనుంది.



తమిళనాడులో నెలకొన్న పరిస్థితులు, పాలన సాగుతున్న విధానాల గురించి పళనిస్వామి ప్రధానికి వివరించనున్నట్టు సమాచారం. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఆర్థిక మంత్రితో ఆయన చర్చించనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. స్టాలిన్ ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి ప్రణబ్‌కు ఫిర్యాదు చేశారు. సోనియా గాంధీ సహా ఇతర నేతలను కలిశారు. తాజాగా పన్నీరు సెల్వం వర్గం ఇదే విషయంపై ఫిర్యాదు చేయనుంది.



కాగా సీఎం పళనిస్వామి వర్గీయులు తమిళనాడుకు సంబంధించిన విషయాలపై చర్చించనున్నారు. ప్రస్తుతం పన్నీర్ సెల్వం పక్షాన ఉన్న 12 మంది ఎంపీల్లో 10 మంది లోక్‌సభ సభ్యులు కాగా మిగతా ఇద్దరు రాజ్యసభలో కొనసాగుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: