తెల్లజాతి అహంకార హత్యకు ప్రెసిడెంట్ ట్రంప్ సమాదానం? సునయనా శ్రీనివాస్




అమెరికా వలసలతో పుట్టి అనేక దేశాల నుండి వలస వచ్చిన వారివల్లనే ఈ స్థాయికి వచ్చింది. అలాంటి దేశ ప్రజలకు ఏక త్వములో భిన్నత్వం కలిగి ఉండాలి. ఎవరి చరిత్ర చూసినా వారి మూలాలు పరదేశములోనే ఉంటాయి. విభిన్న మూలాల తో విభిన్న చరిత్రలతో సంస్కృతీ సాంప్రదాయాలతో అనెక దేశాల ప్రజల వారసత్వంతో వారి వారి కృషి సహకారాలతో ఈనాడు అమెరికా సంపూర్ణ పరిపూర్ణతలతో అగ్రరాజ్యంగా ఎదిగి ప్రపంచానికే పెద్దన్న అయింది. "చెరకుతుద వెన్నుపుట్టిన" అన్న సామెతను నిజం చేస్తూ కొత్త నాయకుడు కొత్తా దేముడండీ లాగా వచ్చి తన పిచ్చి ప్రవచనాలతో శ్వెతజాతి దురహంకారాన్ని పరాకాష్టకు చేర్చేశాడు. దాని ఫలితమే కూచిబొట్ల శ్రీనివాస్ ధారుణ హత్య.  




అమెరికాలోని 'కాన్సస్‌'లో బుధవారం రాత్రి జరిగిన కాల్పుల ఘటనకు ప్రభుత్వమే సమాధానం చెప్పాలని ఈ ఘటనలో మృతిచెందిన కూచిభొట్ల శ్రీనివాస్‌ భార్య సునయన డిమాండ్‌ చేశారు. అమెరికాలో మైనారిటీలపై వివక్షాపూరితమైన దాడులు ఆపేందుకు సర్కార్‌ ఏం చేస్తుందో చెప్పాలన్నారు. ‘కొంతకాలంగా అమెరికాలో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే మేం ఇక్కడి వారమా? కాదా? అని ఆశ్చర్యం కలుగుతోంది’ అని సునయన తెలిపారు.




శ్రీనివాస్‌ ఉద్యోగం చేస్తున్న గార్మిన్  కంపెనీ శనివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సునయన మాట్లాడుతూ:


‘ఇక్కడుండే ప్రతి ఒక్కరూ దేశానికి చెడు తలపెట్టరు. ఇక్కడ మా కుటుంబం బతకాలా? వద్దా? అనే అనుమానం వస్తోంది. విదేశీయులపై అమెరికాలో దాడుల వార్తలను చూసి బాధకలిగేది. మనం అమెరికాలో భద్రంగానే ఉంటామా? అనే అనుమానం వచ్చేది. కానీ మంచోళ్లకు మంచే జరుగుతుందని నా భర్త చెప్పేవారు. మంచిగా ఆలోచించాలి. మంచి పనులే చేయాలి. అప్పుడు మంచే జరుగుతుందని చెప్పేవారు. పని ఒత్తిడి నుంచి కాస్త రిలాక్స్‌ అవుదామని ఆయన బార్‌కు వెళ్లారు. అక్కడి కొచ్చిన వ్యక్తి జాత్యహంకారంగా మాట్లాడుతున్నా, శ్రీనివాస్‌ పట్టించుకోలేదు. బయటకు వెళ్లొచ్చిన ఆ వ్యక్తి ఓ మంచి మనిషిని, అందరినీ ప్రేమించే వ్యక్తిని పొట్టన పెట్టుకున్నాడు. మా ఇద్దరి కుటుంబాల్లో విషాదం నింపాడు. శ్రీనివాస్‌ వాళ్ల అమ్మకు ఇప్పుడేమని సమాధానం చెప్పాలి’ అని సునయన ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనకు ఇలాంటి చావొస్తుందనుకోలేదు. మరో రెండు వారాల్లో ఆయన 33వ పుట్టినరోజు జరుపుకోవాలి. ఆయన అమెరికాను బాగా ప్రేమించారు. చాలా సార్లు వేరే దేశానికి వెళ్లిపోదామా అని అడిగాను. కానీ వేచి చూద్దామనే ఆయన సమాధానమిచ్చారు. ఇప్పుడాయన మృతికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలని’ అని సునయన డిమాండ్‌ చేశారు. 




‘మా ఆయన్ను పొట్టన పెట్టుకున్న వ్యక్తి వేరే బార్‌కు వెళ్లి ఇద్దరు ముస్లిం యువకులను చంపానని గర్వంగా చెప్పుకున్నాడని తెలిసింది. శరీరం రంగు చూసి ఓ వ్యక్తి ముస్లిమా? హిందువా? క్రిస్టియనా అని ఎలా గుర్తిస్తారు?’ అని ఆమె ప్రశ్నించారు.





హైదరాబాద్‌లో అంత్యక్రియల కోసం భారత్‌కు బయలుదేరనున్న సునయన, తన భర్త కలలను సాకారం చేసేందుకు కన్సాస్‌కు తిరిగి వెళ్లనున్నట్లు స్పష్టం చేశారు. ‘ఏ రంగంలోనైనా విజయం సాధించగలననే నమ్మకం నాకుంది. అయితే నా నిర్ణయాన్ని చెప్పేముందు అమెరికా ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఇలాంటి విద్వేషపూరిత ఘటనలను ఆపేందుకు మీరేం చేస్తారో చెప్పండి’ అని ఆమె డిమాండ్‌ చేశారు.


2005లో కూచిభొట్ల అమెరికాలోని 'యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌–ఎల్‌ పాసో (యూటీఈపీ)' లో పీజీలో చేరేందుకు వచ్చారు. ఇదే యూనివర్సిటీలో చేరేందుకు ప్రయత్నించిన సునయనకు శ్రీనివాస్‌తో ఆన్ లైన్ లో స్నేహం కుదిరింది. 2007లో అమెరికా వచ్చిన సునయన మినసోటాలోని 'సెయింట్‌ క్లౌడ్‌ స్టేట్‌ యునివర్సిటీ' లో చేరారు. ఐదేళ్ల తర్వాత 2012లో వీరిద్దరూ వివాహం చేసుకుని న్యూ ఒలేట్ లో ఇంటిని కొనుక్కున్నారు. కాగా, గార్మిన్  కంపెనీ ఆవరణలో శ్రీనివాస్‌కు ఉద్యోగులు ఉద్వేగపూరిత వాతా వరణంలో ఘనంగా నివాళులర్పించారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన అలోక్‌ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 




ఈ మొత్తానికి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నూరిపోస్తున్న జాత్యహంకారమే సమాదానం చెప్పాలి. అమెరికన్స్ అంటూ ఎవరూ లేరు. అందరూ వలసవాదులే. చివరకు ట్రంప్ ఆయన భార్య కూడా!



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: