దొరికినంతా దోచుకో.. దోచుకుంది దాచుకో...!!

Shyam Rao

నాగార్జున హీరో గా నటించిన సూపర్ చిత్రం గుర్తుందా...? ఆ చిత్రంలో దొరికినంతా దోచుకో దోచుకుంది దాచుకో, కారు బంగ్లా తీసుకో లైఫు నీదై పుంజుకో అనే పాట గుర్తుందా...? సరిగ్గా నేటి కొత్త తరం రాజకీయ నాయకులు ఈ పాటనే ఫాలో అవుతూ వస్తున్నారు. దీనికి ప్రత్యక్ష నిదర్శనమే ఈ సంఘటన. ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాల్లో కర్ణాటక చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి రమేష్‌ జారకీహోళీకి చెందిన అక్రమ ఆస్తులు భారీగా వెలుగుచూస్తున్నాయి. మొత్తం రూ.115.2 కోట్ల మేరకు ఆస్తులను గుర్తించారు.



పీసీసీ మహిళ విభాగం అధ్యక్షురాలు లక్ష్మి హెబ్బాళ్కర్‌ నివాసాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు భారీ బోషాణాలను బద్దలు కొట్టారు.  బెళగావి, గోఖక్‌, నిప్పాణి, బెంగళూరు, జావదిల్లోని నివాసాలపై మెరుపు దాడులను కొనసాగించారు. ఇద్దరు కీలక నేతల బెళగావి నివాసాల నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తు వివరాలను అధికారులు వెల్లడించారు. మిగిలిన వారి నుంచి స్వాధీనం చేసుకున్న నగలు, నగదు తదితరాలను త్వరలో బహిర్గతం చేస్తామన్నారు.  ఆ ఇద్దరికి సంబంధించి లెక్కల్లో చూపని రూ.162.8 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఆదాయ పన్ను శాఖ ఉన్నతాధికారులు సోమవారం బెంగళూరులో ప్రకటించారు.



 పెద్ద నోట్ల రద్దు తర్వాత తన వద్ద ఉన్న నగదును మార్చుకునేందుకు మంత్రి అక్రమమార్గం పట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా సహకార బ్యాంకుల్లో బంధువులు, స్నేహితుల పేర్లపై అకౌంట్‌లను తెరిచి అందులో నగదును డిపాజిట్‌ చేస్తూ వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.  ఈ దాడుల్లో అధికారులు ఊహించని విధంగా 12 కేజీల బంగారం, 112 కోట్ల రూపాయల నగదు లభ్యమయ్యాయి. లెక్కల్లో చూపని పెద్ద మొత్తాన్ని చూసిన అధికారులు అవాక్కయ్యారు. దీంతో మంత్రి, ఆయన కుటుంబ సభ్యులను ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తం మంత్రి దగ్గర వెలుగు చూడడంతో కర్ణాటకలో కలకలం రేగుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: