ఆ దేశానికి ఊపిరి ఆడనివ్వం...!!

Shyam Rao

ఉరీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పాలని భావిస్తున్న భారత్‌ 1960 నాటి సింధూ జలాల పంపకం ఒప్పందాన్ని సమీక్షించాలని సోమవారం నిర్ణయించింది. తాజాగా అత్యంత ప్రాధాన్య దేశ హోదా సంగతీ తేల్చాలని నిర్ణయించింది. ఇరవయ్యేళ్ల క్రితం పాకిస్థాన్‌కు కల్పించిన అత్యంత ప్రాధాన్య దేశ(ఎంఎఫ్‌ఎన్‌) హోదాను పునస్సమీక్షించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరగనుంది.


ఉడీ దాడిలో 18మంది సైనికులను పొట్టనబెట్టుకోవడమే కాక.. కశ్మీర్ లో కల్లోలాలు సృష్టిస్తోంది భారతేనని పాకిస్తాన్ యూఎన్ కౌన్సిల్ జనరల్ అసెంబ్లీలో చెప్పింది. దీంతో ఎన్నడూ లేని విధంగా యూఎన్ జనరల్ అసెంబ్లీలో భారత్ పాక్ కు ధీటుగా సమాధానం కూడా ఇచ్చింది. అంతేకాదు అప్పటివరకూ అంతర్జాతీయ రాజకీయాల్లో సంయమనంతో అడుగులేస్తున్న భారత ప్రభుత్వంలో తీవ్ర కదలిక మొదలైంది.


ఏళ్లుగా భారత్ పై ఉగ్రవాద దాడులు చేయిస్తూ ప్రపంచసభలలో నీతి సూక్తులు వల్లించే పాకిస్తాన్ ను భారత్ తలుచుకుంటే ఉక్కిరిబిక్కిరి చేయొచ్చు. అవును. సింధు నదీ జలాల్లో ఒప్పందం ప్రకారం మనకున్న హక్కును ఉపయోగించుకున్నా.. నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్నా.. అది పాకిస్తాన్ పాలిట యమపాశమే అవుతుంది. సుంకాలు, వాణిజ్యాల సాధారణ ఒప్పందం(గాట్‌) కింద 1996లో పాకిస్థాన్‌కు భారత్‌ ఎంఎఫ్‌ఎన్‌ హోదా కల్పించింది. ఈ ఒప్పందంపై భారత్‌-పాక్‌లు రెండూ సంతకం చేశాయి. ఈ ఒప్పందంపై సంతకం చేసిన దేశాలన్నీ పరస్పరం ప్రాధాన్య వాణిజ్య భాగస్వాములే.


అయితే, పాకిస్థాన్‌ భారత్‌కు అధికారికంగా అత్యంత ప్రాధాన్య హోదా ఇంతవరకు ఇవ్వలేదు. భారత్‌ ఇచ్చిన అత్యంత ప్రాధాన్య దేశ హోదా వల్ల పాక్‌ తక్కువ సుంకాలతో ఎగుమతి-దిగుమతి వ్యాపారం చేసుకోగలుగుతోంది. అయితే, అసోచాం లెక్కల ప్రకారం భారత్‌ విదేశీ వాణిజ్యంలో పాకిస్థాన్‌ వాటా స్వల్పమే. భారత్‌ ఎగుమతుల్లో కేవలం 0.83 శాతం(రూ.14433 కోట్లు) పాకిస్థాన్‌కు వెళ్తున్నాయి. భారత్‌ దిగుమతుల్లో కేవలం 0.13శాతం(రూ.3325 కోట్లు) పాకిస్థాన్‌ నుంచి వస్తున్నాయి. సోమవారం ప్రధాని అధ్యక్షతన జరిగిన సింధూ జలాల ఒప్పందసమీక్ష సమావేశంలో కశ్మీరు వాటాకు వచ్చే సింధూ పరీవాహక ప్రాంత జలాలను గరిష్ఠంగా వాడుకొనేందుకు వీలుగా ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించారు. ఇది పాకిస్థాన్‌లోని నదీప్రవాహాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.


యుద్ధాల సమయంలో కూడా రద్దు చేసుకోని ఒప్పందాన్ని కొనసాగించడంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్చించారు. రక్తం నీరూ కలిసి ఒకేసారి ప్రవహించలేవంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు కూడా. నదీ జలాల ఒప్పందాన్ని భారత్ ఒక్కటే రద్దు చేసుకోలేదని పాక్ చేస్తున్న వ్యాఖ్యలు ఉత్తి మాటలే. భారత్ తలుచుకుంటే ఒప్పందాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు రద్దు చేసుకోవచ్చు. ఇందుకు సంకేతాలను కూడా ఇప్పటికే భారత్ బయటపెట్టింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: