బాలకృష్ణ కోసం నువ్వు వైఎస్ కాళ్లు పట్టుకుని వేడుకోలేదా...?

Shyam Rao

రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు ధైర్యముంటే ఆమరణ దీక్షకు దిగాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి సవాల్ విసిరారు. నావి దొంగ దీక్షలని విమర్శిస్తున్నారు... మరి అధికారంలో లేనప్పుడు మీరు చేసిన దీక్షలను ఏమనాలో చెప్పాలని సీఎం చంద్రబాబుకు కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో చంద్రబాబుకు ముద్రగడ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖను ముద్రగడ విడుదల చేశారు. దమ్ముంటే ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్ష చేయండి అంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు. మీతోపాటు నేను కూడా దీక్షలో పాల్గొంటానని ముద్రగడ స్పష్టం చేశారు. మీరే దీక్ష తేదీ నిర్ణయించండి... ఎవరి సత్తా ఏమిటో తేలుతుందన్నారు.  


బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల ఘటనపై ఆయన్ను కాపాడేందుకు చంద్రబాబునాయుడు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి కాళ్లు పట్టుకుని వేడుకున్నారని కాపు సామాజిక వర్గం నేత ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. తన బావమరిదిని రక్షించుకోవడానికి, ఆయన్ను చట్టం ఉచ్చు నుంచి తప్పించడానికి చంద్రబాబు దిగజారిపోయారని విమర్శించారు. కాపు ఉద్యమం పుట్టిందే చంద్రబాబునాయుడి వల్లని, ఉద్యమానికి మూల కారకుడు ఆయనేనని ముద్రగడ వ్యాఖ్యానించారు.



"మీ దయ వల్ల నాకు సిగ్గు, లజ్జ పూర్తిగా పోయాయి. ఎప్పుడూ నోటి నుంచి రాని పదాలు కూడా వస్తున్నాయి. మీరు మహా అయితే నన్ను ఆపేందుకు ఆఖరి అస్త్రంగా నా బట్టలు ఊడదీయించి, పోలీసుల బూటు కాళ్లతో తన్నిస్తారు. నన్నేమైనా చేసుకోండి. గతంలో మా జాతికి ఇచ్చిన హామీని అమలు చేయాల్సిందే. అప్పటిదాకా ఊరుకోబోను" అని ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన లేఖలో ఆయన డిమాండ్ చేశారు.


సమాజంలో వెనుకబడిపోయిన కాపుల భవిష్యత్తు బాగుండాలని తాను ఉద్యమాలు చేస్తుంటే, వాటిని అణచి వేయాలన్న ఉద్దేశంతో కాపులతోనే తనను తిట్టిస్తున్నారని దుయ్యబట్టిన ఆయన, హోదా కోసం చంద్రబాబు దీక్ష చేస్తే, తాను కూడా ఆ క్షణం నుంచి దీక్షను ప్రారంభిస్తానని, చంద్రబాబు పక్కనే కూర్చుంటానని చెబుతూ, అప్పుడు ఎవరు ఎక్కువ రోజులు దీక్ష చేయగలరో, ఎవరి సత్తా ఏంటో ప్రజలకు తెలుస్తుందని అన్నారు. అధికారంలో లేనప్పుడు చంద్రబాబు కూడా దీక్షలు చేశారని గుర్తు చేసిన ఆయన, అవి కూడా దొంగ దీక్షలేనా? అని ప్రశ్నించారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: