దేవినేని - జక్కంపూడికి మంచి ఛాన్స్.. ఫ్రూవ్ చేసుకుంటే మంత్రులే..?
అధినేత కనుసన్నల్లోనే వారు రాజకీయాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వారికి మాజీ సీఎం జగన్ కీలక పార్టీ పదవులు అప్పగించారు. వీటిలో కనుక వారు సక్సెస్ అయి.. తమను తాము నిరూపించుకుంటే భవిష్యత్తుకు తిరుగు ఉండదన్న చర్చలు వైసీపీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. రాజకీయాలు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. సో.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి కనుక వస్తే.. జక్కంపూడి, దేవినేనిలకు మంత్రి పదవులు ఖచ్చితంగా వస్తాయన్నది పరిశీలకుల అంచనా. సో.. ఇప్పుడు ఈ కష్ట కాలంలో వారు పార్టీకి సేవలు అందించే విధానంపైనే వారు పార్టీ అధినేతకు మరింత దగ్గరయ్యే ఛాన్సులు ఉన్నాయి.
జక్కంపూడి రాజా: తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో 2019లో విజయం దక్కించుకున్న రాజా.. తాజా ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. అయినా పార్టీకి ఆయన చేసిన సేవ, ప్రజల్లో ఉన్న విశ్వాసం నేపథ్యంలో పార్టీ అధినేత జక్కంపూడికి కీలక పదవినే అప్పగించారు. అధికారంలో ఉన్నప్పుడే.. తూర్పు గోదావరి పార్టీ అధ్యక్ష పగ్గాలు అప్పగించారు. అంతేకాదు.. కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవిని కూడా ఇచ్చారు. ఇక, ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. అయినప్పటికీ.. జగన్ ఆయన ప్రాధాన్యాన్ని గుర్తించారు. ఈ క్రమంలోనే వైసీపీ యువ జన విభాగం రాష్ట్ర అధ్యక్ష పగ్గాలను ఇచ్చారు. కాపు సామాజిక వర్గానికి చెంది న రాజా.. ఆ వర్గాన్నిపార్టీ వైపు మలుపు తిప్పడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈయన వచ్చే నాలుగేళ్లు మరింత శ్రమించేందుకు ఇది కీలక సమయం అనడంలో సందేహం లేదు. ఎలాంటి ఆరోపణలు లేని నాయకుడిగా పేరున్న రాజా.. వైసీపీని పుంజుకునేలా చేస్తే... మళ్లీ ఏర్పడే వైసీపీ ప్రభుత్వంలో మంత్రి పదవి ఖాయమనే టాక్ ఉంది. పైగా జనసేన + టీడీపీ కూటమి నేపథ్యంలో తన ఫ్యామిలీకి ఉన్న బలమైన క్లీన్ ఇమేజ్‌తో రాజా గోదావరి జిల్లాల్లో తన బలమైన వర్గాన్ని పార్టీ వైపు టర్న్ చేయడంలో ఈ నాలుగేళ్లు చాలా కీలకం.
దేవినేని అవినాష్: ఈ ఏడాది ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన అవినాష్.. వాస్తవానికి, పార్టీ అధినేత జగన్‌తో మంచి రేపో మెయింటెన్ చేస్తున్నారు. కృష్ణలంక కరకట్ట వద్ద వరద రాకుండా.. ఇక్కడి వేలాది కుటుంబాలు ఇబ్బంది పడకుండా.. రిటైనింగ్ వాల్ నిర్మించడంలో దేవినేని చొరవ చూపించారు. అసంపూర్తిగా ఉన్న ఈ రిటైనింగ్ వాల్‌ను రు. 30 కోట్ల రూపాయలను తీసుకువచ్చి.. దీనిని పూర్తి చేశారు. అంతేకాదు.. మంత్రులకు సైతం దక్కని.. అప్పాయింట్‌మెంట్లు.. జగన్ దగ్గర అవినాష్‌కు దక్కాయంటే ఆశ్చర్యం వేస్తుంది.
అదేవిధంగా విజయవాడలో అయినా.. తాడేపల్లిలో అయినా.. పార్టీ కార్యక్రమాలు ఏం జరిగినా.. దేవినేని ఉండాల్సిందే అన్నంతగా అధినేతతో ఆయన బంధం పెనవేసుకుపోయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా దేవినేనికి జగన్ పగ్గాలు అప్పగించారు. ఈనేపథ్యంలో వచ్చే నాలుగు సంవత్సరాలు తనను తాను నిరూపించుకుంటే.. పార్టీని బలోపేతం చేస్తే..ఇక, అవినాష్‌కు తిరుగు ఉండదన్న సంకేతాలు వస్తున్నాయి. ఆయనకు జగన్ ఖచ్చితంగా కమ్మ కోటాలో మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు. అయితే.. ఇది ఆయన కష్టపడే తీరుపైనే ఆధారపడి ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.