ఆ వైసీపీ మంత్రి ఫ్యామిలీని చంద్రబాబు టార్గెట్‌ చేశారా?

వైసీపీ హయాంలో యాక్టివ్‌గా ఉన్న నేతలను టీడీపీ సర్కారు టార్గెట్ చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకించి చంద్రబాబు, లోకేశ్‌లపై విమర్శల యుద్ధం చేసిన నాయకులను ప్రత్యేకించి టార్గెట్ చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అలాంటి వారిలో మాజీ మంత్రి పేర్ని నాని ఒకరు. ఇప్పుడు ఆయన కుటుంబంపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఇక విచారణ పేరుతో పేర్ని నాని కుటుంబాన్ని వేధిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.

రేషన్ బియ్యం అక్రమాల కేసులో పేర్ని నాని భార్యపై కేసు నమోదు చేసిన కూటమి ప్రభుత్వం దానిపై బాగా ఫోకస్‌ పెట్టినట్టు తెలుస్తోంది. అయితే పేర్ని నానికి వైసీపీ నుంచి మంచి అండ లభిస్తోంది. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఎదుర్కొంటున్నవైయ‌స్ఆర్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నానికి తాము అండగా ఉండామని వైసీపీ అంటోంది. తాజాగా నానిని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు పరామర్శించారు. మచిలీపట్నంలోని ఆయన నివాసంలో పేర్ని నానిని వైయ‌స్ఆర్‌సీపీ మాజీ మంత్రులు జోగి రమేష్‌, మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కలిశారు.

పేర్ని నానిని కలిసిన వారిలో మాజీ ఎమ్మెల్యేలు  కైలే అనిల్ కుమార్, సింహాద్రి రమేష్, పెడన సమన్వయకర్త ఉప్పాల రాము కూడా ఉన్నారు. ప్రభుత్వ కక్ష సాధింపులను దీటుగా ఎదుర్కొందామని వారు ఈ సంద‌ర్భంగా పేర్నినానికి సంఘీభావం తెలిపారు. కూటమి సర్కారు వైఫల్యాల మీద నిలదీస్తున్న ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

వైసీపీ నేతలపై కక్ష సాధింపులకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వ తీరుపై వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు మండిపడ్డారు. మాజీ మంత్రుల నుంచి సాధారణ కార్యకర్తల వరకూ అందరిపైనా అక్రమ కేసులు బనాయిస్తున్నారని మాజీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతుందని మాజీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేసారు. అందులో భాగంగానే ప్రభుత్వ తప్పిదాలను నిలదీస్తున్న పేర్ని నాని కుటుంబాన్ని కేసుల పేరుతో వేధిస్తోందన్నారు. పేర్ని నాని కుటుంబానికి వైసీపీ పూర్తిగా అండగా ఉంటుందని మాజీ మంత్రులు భరోసా ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: