రాజ్య సభ సీటు విషయంలో చంద్రబాబు, పవన్ లకి ఝులక్ ఇచ్చిన అమిత్ షా?
ఏపీలో ముచ్చటగా మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయి. అయితే ఇవన్నీ వైసీపీ గెలుచుకున్నవే. ఏపీలో చూస్తే టీడీపీ పుట్టాక రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకపోవడం మొదటిసారి. అది 2024లో జరిగింది. ఇప్పటికి తొమ్మిది నెలలుగా పెద్దల సభలో టీడీపీ ప్రాతినిధ్యం లేదు. ఇప్పుడు ఈ మూడు సీట్లు ఖాళీ కావడంతో టీడీపీలో చాలా మంది పోటీ పడుతున్నారు.
సీనియర్ల జాబితాలో మాజీ మంత్రులు యనమల రామక్రిష్ణుడు, అశోక్ గజపతిరాజు ఉన్నారు. పార్టీకి తాము దశాబ్దాలుగా చేసిన సేవలను గానూ ఇది సముచితమైన గౌరవం అని బావు భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా రాజ్యసభకు వెళ్లాలని చూస్తున్నారుట. మరో మాజీ మంత్రి దేవినేని ఉమా కూడా తన మైలవరం సీటుని వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వసంత కృష్ణ ప్రసాద్ కి త్యాగం చేసినందువల్ల తనకు చాన్స్ ఇవ్వాలని కోరుతున్నారని అంటున్నారు.
2020 దాకా టీడీపీలో ఉంటూ వైసీపీలోకి వెళ్ళి రాజ్యసభ సీటు అందుకున్న బీద మస్తాన్ రావు తనకు తిరిగి రాజ్యసభకు పంపుతారు అన్న భరోసా మేరకే రాజీనామా చేశారు అని అంటున్నారు. ఇక మూడు సీట్లూ బీసీలకే చెందినవి కావడంతో ఇస్తే బీసీకే ఒకరికి అయినా ఇవ్వాలని చూస్తున్నారు.
ఈ మూడింటిలో జనసేనకు ఒక సీటు కచ్చితంగా ఇవ్వాల్సి ఉంది అని అంటున్నారు. ఆ సీటుకు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుని ప్రతిపాదించాలని జనసేన నిర్ణయించిందని టాక్ నడుస్తోంది. అయితే సడెన్ గా కేంద్రంలోని బీజేపీ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చింది అని అంటున్నారు. బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి ఒకరిని ఏపీ కోటాలో రాజ్యసభకు పంపించాలని కేంద్ర పెద్దలు టీడీపీ పెద్దలను కోరినట్లుగా ప్రచారం సాగుతోంది. పొత్తు పార్టీలు పైగా బీజేపీ పెద్దలు కోరి మరీ అడిగారు కాబట్టి బీజేపీకి ఒక సీటు ఇవ్వడం గ్యారంటీ అని కూడా అంటున్నారు.
టీడీపీకి ఒక సీటు మాత్రమే ఉండొచ్చు అని అంటున్నారు. పోటీ తీవ్ర స్థాయిలో ఉన్న వేళ టీడీపీ ఎవరికి ఇస్తుంది అన్నది చూడాల్సి ఉంది. అయితే ఇంతటి పోటీ నెలకొంటే దివంగత నేత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినికి ఈ సీటు ఇస్తే ఇక ఎవరూ పోటీకి రారు అన్న వ్యూహం కూడా ఉందని అంటున్నారు. మొత్తానికి చూస్తే టీడీపీ బీజేపీ జనసేన మూడు సీట్లను పంచుకోనున్నాయని అంటున్నారు. మరి బీజేపీ నుంచి ఏపీ కోటాలో రాజ్యసభలోకి వెళ్ళే ఆ కేంద్ర మంత్రి ఎవరు అన్న చర్చ అయితే సాగుతోంది.