మడకశిరలో కొత్త ట్రెండ్‌..వైసీపీ నేతల ఇంటికి టీడీపీ ఎమ్మెల్యే?

Veldandi Saikiran
అనూహ్యంగా రాజకీయ అరంగేట్రం చేసిన ఎమ్మెస్ రాజుకు అదృష్టం కూడా అలాగే కలిసి వచ్చింది. టీడీపీలో సాధారణ కార్యకర్తగా ఉన్న ఎమ్మెస్ రాజు టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్ష పదవి రావడంతో అతనే నమ్మలేకపోతున్నారు. అలానే లక్ కంటిన్యూ అవుతూ అసెంబ్లీ ఎన్నికల్లోను కలిసి వచ్చింది. ఎన్నికలకు కేవలం 20 రోజులు ముందు మడకశిర టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెస్ రాజు పేరు ప్రకటించడం పార్టీలో సంచలనం. మడకశిర నియోజకవర్గంతో సంబంధం లేని ఎమ్మెస్ రాజును మడకశిర అభ్యర్థిగా ప్రకటించింది టీడీపీ అధిష్టానం.

కొత్త చోట ఎలా ఉంటుందోనని అనుమాన పడాల్సిన పని లేకుండా వైసీపీ అభ్యర్థి పేరులో ఉన్న లక్ ఎమ్మెస్ రాజుకు కూడా కలిసి వచ్చిందని సరదాగా చెప్పుకుంటున్నారు. టీడీపీ నుంచి ఎమ్మెస్ రాజు ఆటు వైసీపీ నుంచి పోటీ చేసిన లక్కప్ప ఇద్దరు ఆయా పార్టీలో సామాజిక కార్యకర్తలే. మడకశిర వైసీపీ అభ్యర్థిగా లక్కప్ప పేరును ప్రకటించగానే ఆయనకు ఎంత లక్కో అని అనుకున్నారట అందరూ. ఎన్నికలకు 20 రోజుల ముందు మడకశిర టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఎమ్మెస్ రాజు తనదైన స్టైల్ లో ప్రజలను ఆకట్టుకున్నారు. గెలిచాక కూడా అదే ఒరవడితో కొత్త తరహా రాజకీయానికి శ్రీకారం చుట్టారు టీడీపీ ఎమ్మెల్యే.

అన్ని మండలాలను చుట్టేసి ప్రజలకు మరింత దగ్గర అయ్యే ప్రయత్నం చేశారు. మిగిలిన నాయకులకు భిన్నంగా ప్రజల దగ్గరకు వెళ్లి సమస్యలను తెలుసుకుంటున్నారు. పాల ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీలించి మడకశిర పాల రైతుల నుంచి పాలను సేకరించి గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ సందర్శించి విద్యార్థుల సమస్యలను తెలుసుకోవడంతో పాటు బీసీ హాస్టల్లో రాత్రి అక్కడ నిద్ర చేశారు. హాస్టల్స్ లో కంప్లైంట్ బాక్స్ ను ఏర్పాటు చేశారు. సొంత నిధులతో ఉచితంగా డీఎస్సీ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో ఒక వైపు సమస్యలపై దృష్టి పెడుతూనే మరోవైపు భిన్నంగా రాజకీయాలు చేస్తున్నారు మడకశిర ఎమ్మెల్యే.

ప్రభుత్వం మారాక రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ, వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలాగా ఉంది పరిస్థితి. రెండు పార్టీల నాయకులు ఎదురుపడితే ఎదురుపడితే రనరంగం అనేలా ఉంది వాతావరణం. కానీ రాజకీయం ఎన్నికల వరకే అంటూ మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు తనపై పోటీచేసి ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి లక్కప్పని మర్యాదపూర్వకంగా కలిశారు. లక్కప్ప ఇంటికి వెళ్లి ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి బేధభావాలు లేకుండా ఓడిన అభ్యర్థిని అధికార పార్టీ ఎమ్మెల్యే వెళ్లి కలుసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఓడిపోయిన ప్రత్యర్థి ఇంటికి వెళ్ళి పలకరించే కొత్త సాంప్రదాయాన్ని మడకశిర ఎమ్మెల్యే తీసుకువచ్చారని అంటున్నారు. రాజకీయ ప్రత్యర్ధిని  అలా ఎలా కలుస్తారనే వాళ్లకు.....ఎన్నికల సమయంలోనే రాజకీయం. ఎన్నికలు అయిపోయిన తర్వాత నియోజకవర్గ అభివృద్దే లక్ష్యం అన్నది ఎమ్మెల్యే నోటి నుంచి వస్తున్న సమాధానం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: