వివాదం అవుతున్నారు.. అధ్య‌క్షా!

RAMAKRISHNA S.S.
ఇప్పుడు నేను స్పీక‌ర్ స్థానంలో ఉన్నా. నాకు పార్టీకి సంబంధం లేదు. మీరు నాకు గ‌తంలో మిత్రుడే కావొచ్చు. ఇద్ద‌రం కలిసి జెండా మోసీ ఉండొచ్చు. కానీ.. ఇప్పుడు నా నిర్ణ‌య‌మే అంతిమం`- ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ తొలి స్పీక‌ర్‌గా ప‌నిచేసిన అయ్య‌దేవ‌ర కాళేశ్వ‌ర‌రావు(ఈ పేరుతో విజ‌య‌వాడ‌లో భారీ మార్కెట్ కూడా ఉంది) చేసిన వ్యాఖ్య‌లు ఇప్ప‌టికీ చ‌రిత్ర పుట‌ల్లో సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించే ఉన్నాయి. కాంగ్రెస్ నాయ‌కుడిగా ఉన్న ఆయ‌న‌.. అదే పార్టీ అధికార‌ స‌భ్యుల‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లివి.
`మీరు రాజీనామా చేయ‌మంటే.. చేయ‌డానికి నేను పార్టీ నాయ‌కుడికాదు. అఫ్ కోర్స్ పార్టీ గుర్తుపై గెలిచి ఉండొచ్చు. కానీ, నేను స‌మున్న‌త లోక్‌స‌భ స్పీక‌ర్‌ను. నేను పార్టీకి రాజీనామా చేస్తానే కానీ.. స్పీక‌ర్‌గా మాత్రం ఆ సీటుకు అన్యాయం చేయ‌లేను` - లోక్‌స‌భ స్పీక‌ర్‌గా 2004-09 మ‌ధ్య ప‌నిచేసిన ప‌శ్చిమ బెంగాల్‌కు చెందిన సోమ‌నాథ్ ఛ‌ట‌ర్జీ త‌న సొంత పార్టీ(చ‌నిపోయాక‌.. ఎర్ర జెండా నా దేహంపై క‌ప్పండి అని విన్న‌వించుకున్న నాయ‌కుడు) సీపీఎం అధినాయ‌క‌త్వాన్ని ధిక్క‌రించి స్పీక‌ర్ స్థానానికి వ‌న్నె తెచ్చారు.
కానీ, నేడు ఆ స్ఫూర్తి ఏది?  ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో స్ఫూర్తి కాదు క‌దా.. క‌నీస నిబంధ‌న‌లు కూడా పాటించ‌ని వైనం ప్రజాస్వామ్య వాదుల‌ను క‌ల‌చి వేస్తోంది. తాజాగా జ‌రిగిన రెండు ఘ‌ట‌న‌లు రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టుల‌కు ఎక్కాయి. ఈ క్ర‌మంలో తెలంగాణ హైకోర్టు.. స్పీక‌ర్‌ను ఉద్దేశించి సీరియ‌స్‌గానే ఆదేశాలు ఇచ్చింది. ఇక‌, ఏపీ హైకోర్టు కేసును విచార‌ణ‌కు తీసుకుంది. త‌ర్వాత‌.. ఏం చేస్తుందో చూడాలి.
తెలంగాణ‌లో ఏం జ‌రిగింది?
బీఆర్ ఎస్ పార్టీ త‌ర‌ఫున ఖైర‌తాబాద్ నుంచి విజ‌యం ద‌క్కించుకున్న దానం నాగేంద‌ర్‌.. త‌ర్వాత కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఇలా పార్టీ మార‌డాన్ని అధిక్షేపిస్తూ.. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మ‌హేశ్వ‌ర రెడ్డి.. దానంపై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని ఓ పిటిష‌న్‌ను స్పీక‌ర్ ప్ర‌సాద‌రావు కు ఇవ్వ జూపారు. కానీ, ఆయ‌న స్వీక‌రించేందుకు కూడా.. విముఖ‌త వ్య‌క్తం చేశారు. దీంతో ఏలేటి హైకోర్టును ఆశ్ర‌యించారు.  అస‌లు త‌న పిటిష‌న్‌నే స్పీక‌ర్ తీసుకునేందుకు ఇష్ట ప‌డ‌డం లేదేన్నారు.  దీనిని విచారించిన కోర్టు స్పీక‌ర్ స్థానంలో ఉన్న వ్య‌క్తి.. పిటిష‌న్‌ను తీసుకోక‌పోవ‌డం ఏంటి?  వెంట‌నే తీసుకుని.. దీనిని రుజువు చేస్తూ.. ఎక‌నాలెడ్జ్‌మెంట్ కాపీని ఏలేటి(పిటిష‌నర్‌)కి ఇవ్వాల‌ని ఆదేశించింది. - ఇక‌, ఇప్పుడు స్పీక‌ర్ దిగిరాక త‌ప్ప‌దు. మ‌రేది స్ఫూర్తి.. నిబంధ‌న‌?!
ఏపీలో ఏం జ‌రిగింది?
త‌మ‌కు 11 సీట్లే వ‌చ్చినా.. స‌భ‌లో మ‌రో రాజ‌కీయ పార్టీ ప్ర‌తిప‌క్షంగా లేనందున‌.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా మాకే ఇవ్వాల‌ని కోరుతూ.. వైసీపీ అధినేత‌, పులివెందుల ఎమ్మెల్యే, మాజీ సీఎం జ‌గ‌న్‌.. స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడికి లేఖ రాశారు. ఆయ‌న స్వీక‌రించారు కూడా. కానీ, నెల రోజులు జ‌రిగినా.. దీనికి స‌మాధానం లేదు. ఇస్తామ‌ని కానీ, ఇవ్వ‌బోమ‌ని కానీ.. ఆయ‌న స‌మాధానం చెప్ప‌లేదు. దీంతో వైసీపీ నేరుగా స్పీక‌ర్‌ను ప్ర‌తివాది(మ‌రికొంద‌రిని కూడా)గా చేరుస్తూ.. హైకోర్టులో పిటిష‌న్ వేసింది.  మ‌రి దీనిపై హైకోర్టు ఏం చెబుతుందో చూడాలి. - ఇక్క‌డ కూడా.. స్ఫూర్తి కానీ, గ‌త‌ నిబంధ‌న‌లను కానీ స్పీక‌ర్ పాటించ‌లేదు.
- కొస‌మెరుపు.. రాజ‌కీయాలు వేరు.. రాజ్యాంగ బ‌ద్ధంగా అందివ‌చ్చిన  స్పీక‌ర్ ప‌ద‌వులు వేరు. కానీ, రాజ‌కీయాల‌నే అంటిపెట్టుకుంటున్న స్పీక‌ర్లు.. రాజ్యాంగ నిబంధ‌న‌ల‌ను ఎవ‌రూ పాటించ‌డం లేదు. మ‌హారాష్ట్ర స్పీక‌ర్ అయితే.. ఉద్ధ‌వ్ ఠాక్రే(మాజీ సీఎం)  కేసు విష‌యంలో  సుప్రీం కోర్టుతోనే అక్షింత‌లు వేయించుకున్న సంగ‌తి ఇక్క‌డ ప్ర‌స్తావ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: