కేంద్ర బడ్జెట్ విషయంలో తెలంగాణకు అన్యాయం.. ఢిల్లీలో ఎంపీల రచ్చ?

Purushottham Vinay
కేంద్ర బడ్జెట్ విషయంలో తెలంగాణకు అన్యాయం.. ఢిల్లీలో ఎంపీల రచ్చ?


కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ ఎంపీలు ధర్నా చేపట్టడం జరిగింది. ఇక ఈ ధర్నాలో నాగర్ కర్నూల్ ఎంపీ డా. మల్లు రవి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామ రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య ఇంకా అలాగే జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ లో జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ప్రధాని, కేంద్ర ఆర్ధికశాఖ మంత్రికి లేఖలు రాస్తున్నామని నాగర్ కర్నూల్ ఎంపీ డా. మల్లు రవి తెలిపడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ కు కేటాయింపులను మాత్రం వ్యతిరేకించడం లేదన్నారు. కేవలం తెలంగాణకు కేటాయింపులు జరపమని కోరుతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో బీఆర్ఎస్, బీజెపీతో రాజీపడిందని అన్నారు. బడ్జెట్ పై చర్చ సంధర్భంగా తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని లేవనెత్తుతామన్నారు. తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగేంతవరకు పార్లమెంట్ లో పోరాటం చేస్తామన్నారు. తెలంగాణలోని పాత జిల్లాల్లో 9 జిల్లాలకు వెనుకబడిన ప్రాంత నిధులు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారని తెలిపారు. ఆ హామీపై ఎలాంటి ప్రస్తావన లేదన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేవలం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే అమలు చేసేలా బడ్జెట్ లో హామీలు, కేటాయింపులు ఉన్నాయని తెలిపారు.అలాగే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని బిజెపి ఎంపీలు వమ్ము చేశారని అన్నారు.


తెలంగాణ నుండి ఇద్దరు కేంద్ర మంత్రి వర్గంలో ఉన్నా కానీ ఏమాత్రం న్యాయం జరగలేదన్నారు. 2014 నుంచి విభజన చట్టం లోని పలు అంశాలపై ఎప్పుడు లేని కేటాయింపులు ఈసారి బడ్జెట్ లోనే ఎందుకు చేశారని ప్రశ్నించారు. ప్రధాని తన కుర్చీ కాపాడుకునేందుకే బడ్జెట్ లో నితీశ్, చంద్రబాబు రాష్ట్రాలకు న్యాయం చేశారని అన్నారు. లోకసభ ఎన్నికల్లో బిజెపికి సహకరించిన బీఆర్ఎస్ నేతలు, ఇప్పుడు కాంగ్రెస్ విమర్శిస్తున్నారన్నారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య  నిన్నటి కేంద్ర బడ్జెట్ తెలంగాణ ప్రజలకు చీకటి రోజన్నారు.నిర్మలా సీతారామన్ తెలంగాణ పై బడ్జెట్ లో వివక్ష చూపారన్నారు. భారతదేశం అంటే కేవలం ఆంధ్రప్రదేశ్, బీహార్ లేనా? అని ప్రశ్నించారు. బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై బిజెపి ఎంపీలను, కేంద్ర మంత్రులను బీఆర్ఎస్ నేతలు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. భారతదేశంలో రెండవ అతి పెద్దజాతర అయిన "సమ్మక్క- సారక్క" జాతరకు ఎందుకు జాతీయ హోదాని ఇవ్వలేదన్నారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదని అన్నారు. ప్రధాని, కేంద్రమంత్రులను సి.ఎమ్ రేవంత్ రెడ్డి కలిసి, అభ్యర్ధించినా కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ కు ఏమాత్రం ప్రయోజనం లేదని తెలిపారు.జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ అయితే బడ్జెట్ లో తెలంగాణ కు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు ఢిల్లీ వేదికగా ధర్నా చేద్దామన్నారు. కేసీఆర్ వస్తే, రేవంత్ రెడ్డి కూడా వస్తారని అన్నారు. జంతర్ మంతర్ లో ధర్నా చేసి కేంద్రాన్ని నిలదీద్దామని అన్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు కూడా ఈ ధర్నాలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: