AP: కరుణించిన కేంద్రం.. కానీ అసలైంది ఒక్కటి తక్కువైంది?

Purushottham Vinay

• అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం

 

• వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు

 

• ప్రత్యేక హోదా ఏదని మండిపడుతున్న నెటిజన్స్ 


ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్ : ఆంధ్రప్రదేశ్ పై కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం కరుణ చూపిందనే చెప్పాలి. ఈ బడ్జెట్ లో రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు కేటాయించింది. అలాగే అమరావతితో పాటు వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ఇంకా ప్రకాశం జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. ఆయా ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ చూపించడంతో పాటు ఏపీ ఆర్బన్ డెవలప్‌మెంట్ కోసం మొత్తం 1500 కోట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహకాలను ప్రకటించారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం పూర్తికి కట్టుబడి ఉన్నామంటూ నిధులు విడుదల చేయనున్నట్లు స్పష్టం చేయడం జరిగింది.ఇంకా అలాగే విశాఖ, చెన్నై కారిడార్, ఓర్వకల్లు నుంచి బెంగుళూరు కారిడార్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, అందుకు తగ్గట్లు నిధులు విడుదల చేస్తామని లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను గట్టెక్కించేలా బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పడం జరిగింది.


కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేక ఆర్థిక సాయంని ఆమె ప్రకటించారు. రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు ఆమె వెల్లడించారు. అంతేగాక అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు కేటాయిస్తామని చెప్పారు.పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సహాయం అందిస్తామని కేంద్రమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రైతులకు జీవనాడి పోలవరం. భారత ఆహార భద్రతకు ఆ ప్రాజెక్టు చాలా కీలకమైనది. పోలవరం నిర్మాణం సత్వరం జరిగేలా చూస్తామని ఆర్ధిక మంత్రి భరోసానిచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు నిర్మలమ్మ ప్రకటించారు.రాయలసీమ, ప్రకాశం ఇంకా ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేస్తామన్నారు. విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తామని కేంద్రమంత్రి నిర్మలా తెలిపారు.హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులని అందిస్తామన్నారు. అలాగే విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్‌లకు ప్రత్యేక సహాయం చేస్తామన్నారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని అన్నారు. అలాగే విశాఖ – చెన్నై కారిడార్‌లో కొప్పర్తికి, హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లుకు నిధులు ఇస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే మరోసారి ప్రత్యేక హోదా ఊసు లేకుండా చేశారని నెటిజన్స్ మండిపడుతున్నారు. కష్టాల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. మరి భవిష్యత్తులోనైన ప్రత్యేక హోదా ఊసు ఉంటుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: