పోలవరంపై చిగురిస్తున్న ఆశలు.. ఈసారి బాబు పూర్తి చేస్తారా?

Purushottham Vinay

• బాబు రాకతో పెరిగిన పోలవరం ఆశలు 

• రాబోయే 5 ఏళ్లలో ప్రాజెక్ట్ పూర్తి నిర్మాణంపై దృష్టి పెట్టిన బాబు 


ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్: ఏకంగా 194 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న బహుళార్థ ప్రయోజనకర పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీటి కొరత ఇక ఉండనే ఉండదు. నదుల నుంచి సముద్రంలోకి మంచి నీరు వృథాగా పోనే పోదు. ఇంతటి భారీ ప్రాజెక్ట్ ని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని సెక్షన్ 90 ప్రకారం జాతీయ ప్రాజెక్ట్‌గా పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్న విషయం ప్రజల్లో ఆశలు చిగురుస్తున్నది. ఇక ఈ ప్రాజెక్ట్‌లో ముఖ్యమైన సహాయ, పునరావాసం కోసం అవసరమయ్యే నిధులు చాలా ముఖ్యమని గుర్తించబడ్డాయి. వీటి వ్యయం, తాగునీరు ఇంకా పారిశ్రామిక నీటి వ్యయ భాగాలను వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రణాళికాబద్ధంగా ఎలా సర్దుబాటు చేయవచ్చు అనే అంశంపై ఖచ్చితంగా చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టాలి. 2024 ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ, అమిత్ షా పోలవరం పూర్తికి తమ మద్దతును తెలియజేసినందున, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్ట్ వచ్చే నాలుగేళ్లలో పూర్తి అవుతుందనడంలో ఎలాంటి సంశయం లేదు. 


అయితే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీ తరువాత 2014లో చంద్రబాబు అభ్యర్థన మేరకు ప్రధాని మోదీ చొరవతో ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన ఏడు మండలాల్లో ఐదు గ్రామాలు వెనక్కి ఇచ్చే ప్రతిపాదన జరిగిందని ప్రచారం జరుగుతోంది, దీనివల్ల ప్రాజెక్ట్ నిర్మాణంలో ఇబ్బందులు తలెత్తవచ్చనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చంద్రబాబు ఈ ప్రాజెక్ట్ పనులు చెయ్యాలని ప్రజల ఆశ. జగన్‌ మోహన్ రెడ్డి తప్పుడు నిర్ణయాల వల్ల పోలవరం,  నిర్మాణంలో  ఆలస్యం వల్ల జరిగిన నష్టాన్ని స్పష్టంగా శ్వేతపత్రం రూపంలో ప్రజల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఉంచారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి ఏర్పడిన సాంకేతిక సమస్యలను అధిగమించటానికి అంతర్జాతీయ నిపుణులను ఆయన పిలిపించారు. వారి సలహాల ప్రకారం ముందుకు వెళ్లడం, నిధులు సమకూర్చడం ద్వారా మాత్రమే నిర్ణీత వ్యవధి నాలుగేళ్లలో ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది. మరి చంద్రబాబు ఈ ప్రాజెక్ట్ ని రాబోయే ఐదేళ్లలో పూర్తి చేస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: