అయ్యో..! అల్లాడిపోతున్న 'పులిచింతల' ప్రాజెక్ట్..?

FARMANULLA SHAIK
* చుక్క నీరు లేకుండా అల్లాడుతున్న ప్రాజెక్ట్
* ప్రస్తుత నీటి సామర్ధ్యం 0.5 టీయంసీనే
* ప్రజా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఆలోచన చేయాల్సిందే..!
(అమరావతి-ఇండియా హెరాల్డ్ ): ఆంధ్రప్రదేశ్లో ప్రజల తాగు మరియు సాగు నీటి అవసరాలు తీర్చడానికి అనేక ప్రాజెక్ట్లు ఉన్నాయి వాటిలో ఒకటైన ప్రాజెక్ట్ పల్నాడు జిల్లాలోని పులిచింతల ప్రాజెక్ట్.కె ఎల్ రావు సాగర్ కృష్ణా నదిపై నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు దిగువన పులిచింతల గ్రామం వద్ద నిర్మించిన సేద్యపు నీటి ప్రాజెక్టు. దీనిని గతంలో పులిచింతల ప్రాజెక్టు అని పిలిచేవారు, ప్రముఖ ఇంజనీరు, రాజకీయనాయకుడు కె.ఎల్.రావు పేరుతో కె ఎల్ రావు సాగర్ అని అధికారిక పేరుపెట్టారు. విజయవాడ వద్దగల ప్రకాశం బారేజికి ఎగువన 85 కి.మీ.ల దూరంలో ఈ ప్రాజెక్టు స్థలం ఉంది. ఈ ఆనకట్ట స్థలం నదికి కుడివైపున పల్నాడు జిల్లాలోని బెల్లంకొండ మండలం పులిచింతల వద్ద, ఎడమ వైపున సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం మండలం వజినేపల్లి వద్ద ఉంది.కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లోని 13.08 లక్షల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణకు ఈ ప్రాజెక్టు వలన వీలవుతుంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా, లైవ్ స్టోరేజీ కెపాసిటీ 36.23 టీఎంసీలు. డ్యామ్ వద్ద 3.61 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ప్రాజెక్టును చేపట్టారు. డిసెంబర్ 7, 2013 న జాతికి అంకితమైంది.

డెల్టా ప్రాంతం స్థిరీకరణ కోసం నిర్మించిన అలాంటి ఈ పులిచింతల ప్రాజెక్టు నేడు నీళ్లు లేక వెలవెలబోతుంది.45.77టీయంసి ల సామర్థ్యం ఉన్న పులిచింతల నేడు అరటీఎంసీ నీళ్లు కూడాలేవు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు పులిచింతల దిగువ ప్రాంతంలో భారీగా ఏర్పడిన నీటి అవసరాలు ప్రాజెక్ట్ ను ఎడారిగా మార్చేసాయి. దానికి తోడు 2021 ఆగస్టు 5వ తేదీ తెల్లవారుజామున వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్న క్రమంలో 16వ నంబరు రేడియల్‌ గేటు కొట్టుకుపోయింది.దాంతో ఆకస్మాత్తుగా నీటిని విడుదల చేసి ప్రాజెక్ట్ ఖాళీ చేయాల్సివచ్చింది.ప్రస్తుతం వరుణ దేవుడు కనిపిస్తే తప్ప ప్రాజెక్టు దిగువ ప్రాంతానికి సాగు మరియు తాగు నీటి అవసరాలు తీరని పరిస్థితి ఏర్పడింది. గడిచిన ఐదేళ్ల నుండి పులిచింతల ప్రాజెక్టులో నీటి లభ్యత బాగా కరువైంది.2019 నుంచి 24 వరకు పులిచింతల ప్రాజెక్టులో నీటి నిలువలు క్రమక్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.ఒకవైపుప్రతి సంవత్సరం తగ్గుతున్న వర్షపు జాడలు ఈరోజు పెరుగుతున్న నీటి అవసరాలు కలిసి పులిచింతల ఎడారిగా మారింది అనేది వాస్తవం.ప్రాజెక్ట్ లో ఉన్న అరటీయంసీలతో ఎటువంటి అవసరాలు తీరవు. భారీ వర్షాలు ఎగువ ప్రాంతాన్ని ముంచేత్తితే తప్ప నీరు పులిచింతకు చేరదు.

2022 లో వచ్చిన భారీ వర్షానికి పులిచింతల ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన నీటి వల్ల ప్రాజెక్ట్ మరల నిండు కుండలాగా మారింది.ఆ ఏడాది దిగువ ప్రాంత అవసరాలకు పోను ప్రాజెక్టులో నీటి వనరులు 33.14 టీయంసీల నిల్వ ఉన్నాయి.కానీ ప్రస్తుత 2024 నాటికీ ఈ విలువ అరటీయంసీకి పడిపోయింది.మరి ఏ ఉద్దేశంతో ఐతే ఈ ప్రాజెక్ట్ నిర్మించారో అది పూర్తి చేయాలంటే కూటమి ప్రభుత్వం తగిన విధంగా ప్రత్యామ్నాయం వెతకాల్సిన సమయం వచ్చింది.ఈ ప్రాజెక్ట్ పై ఆధారపడి లక్షల మంది జీవిస్తున్నారు.మరి భారీ విజయంతో గెలిచినా కూటమి తొందరగా దానిపై సమగ్ర కార్యాచరణ చేపట్టాలని ప్రజలు ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: