పార్లమెంట్ ఫైట్: అభివృద్ధి అంశాలే కాదు.. మహిళల రక్షణ కోసం పోరాడతారా..?

Divya
•పార్లమెంటులో మహిళల రక్షణ చర్చకు వస్తుందా ..
•అమ్మాయిల సాధికారత కాదు మహిళల రక్షణ ప్రధానం..
•మంత్రులు ఈ విషయంపై తప్పకుండా ఫైట్ చేయాల్సిందే.

(ఆంధ్ర ప్రదేశ్ - ఇండియా హెరాల్డ్ )

ఈనెల 20వ తేదీ నుండి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే మంత్రులు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పాటుపడాలని నిర్ణయించుకున్నారు.. అందులో భాగంగానే ఏ ఏ అంశాలపై చర్చిస్తారు..? ఏ విధంగా అడుగులు వేస్తారు..?  అనే విషయాలు ప్రజలలో ఆసక్తిని కలిగిస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ మొదలుకొని పోలవరం ప్రాజెక్టు వరకు ప్రతిదీ కూడా పెండింగ్లో ఉన్న పనులే.. వీటన్నింటినీ పూర్తి చేస్తే ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి.. ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు కల్పించడమే కాకుండా రైతుల కోసం కొన్ని నీటి ప్రాజెక్టుల వల్ల సరైన సమయంలో నీరు లభించి పంటలు బాగా పండించే అవకాశం ఉంటుంది. అలాగే సాగునీరును మొదలుకొని త్రాగునీరు వరకు అన్నింటి విషయాలలో ఇబ్బందులు తొలగిపోతాయి.
ఇక అమరావతి.. సరికొత్తగా రాజధానిని ప్రకటించిన నేపథ్యంలో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం అమరావతిని రాజధానిగా మార్చాల్సి ఉంటుంది .ఇందుకోసం కొన్ని వేల కోట్ల ఖర్చు అవుతుంది ..సమయం కూడా ఎక్కువే. మరి అమరావతి రాజధాని గా పూర్తిగా సిద్ధం చేయడానికి ఇంకా సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే విశాఖ నుంచి రాయలసీమ వరకు ప్రతి ఒక్కరూ అభివృద్ధి ధ్యేయంగా ముందడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. కానీ మహిళల సంరక్షణ కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని మహిళలు ప్రశ్నిస్తున్నారు.
గతంతో పోల్చుకుంటే ఈ మధ్యకాలంలో అత్యాచారాలు మరింత ఎక్కువయ్యాయి.. అంతేకాదు చిన్నపిల్లలు,  పసి గుడ్డు అని కూడా చూడకుండా పిల్లలపై కూడా అత్యాచారాలకు పాల్పడుతూ అత్యంత దారుణంగా హతమారుస్తున్నారు. అమ్మాయి పుట్టిందంటే చాలు తల్లిదండ్రులకు గుండెల్లో భయభ్రాంతులు మొదలవుతున్నాయి .ఒకవైపు మహిళా సాధికారత ధ్యేయంగా మహిళలు పలు రంగాలలో విజయం సాధిస్తూ దూసుకుపోతుంటే మహిళల రక్షణకు మాత్రం ఎవరు ఏ అంశంపై చర్చించకపోవడం అత్యంత బాధాకరమని చెప్పాలి.. గత కొన్ని రోజులుగా చిన్న పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలకు   అడ్డుకట్ట వేసే నాధుడే లేకుండా పోతున్నాడు.. హంతకులను దోషులను నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తే తప్ప.. ఇలాంటి చర్యలు ఆగవనే చెప్పాలి.. మరి మన మంత్రులు పార్లమెంటులో ఈ విషయాన్ని కూడా లేవనెత్తుతారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కచ్చితంగా ఈ విషయంపై స్పందించాలని, ఆడవారికి రక్షణ కల్పించాలని,  అమ్మాయిల జోలికి వచ్చిన వారిని కఠినంగా శిక్షించాలని ఈ విధంగా చట్టాలు తీసుకురావాలని పలువురు కోరుకుంటున్నారు. మరి పార్లమెంటులో ఈ అంశం చర్చకు వస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: