ఏపీ: ఫీల్డ్ లో దిగనున్న మాజీ సీఎం జగన్..?

FARMANULLA SHAIK
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ చిత్తు చిత్తుగా ఓటమి పాలైన సంగతి తెల్సిందే. కూటమి ప్రభుత్వం మాత్రం భారీగా విజయం కైవసం చేసుకుంది.ఈ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం అయింది. దీంతో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ క్రమంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ప్రజలతో మమేకమయ్యెందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమావేశమైన వైఎస్ జగన్ పార్టీ ఓటమి సంబంధించిన నేతలకు భరోసాను కల్పించే ప్రయత్నం చేశారు.ఇదే క్రమంలో రేపటి నుంచి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించేందుకు జగన్ సిద్ధమవుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం జోరుగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వచ్చే పార్టీ నాయకులు కార్యకర్తలతో మాట్లాడడంతో పాటు వారి నుంచి వినతులను స్వీకరించనున్నారు. ఈ విధంగా మాజీ సీఎం జగన్ అధికారంలో లేకున్నా ప్రజా సంక్షేమం గురించి ఆలోచించి, ప్రజల కష్టాలు తీర్చబోతున్నారని పలువురు పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజా దర్బార్ విషయంలో టీడీపీ అనుకూల మీడియా తప్పుడు వార్తలు రాస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అసలు జగన్ కి ప్రజలకు మధ్య దూరం ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. జగన్ ప్రత్యేకంగా ప్రజా దర్బార్ పెట్టాల్సిన అవసరం లేదని, ఆయన నిత్యం ప్రజలతోనే ఉంటున్నారని కొన్ని ఫొటోల్ని ప్రదర్శించారు. జగన్ అంటేనే జనం, జనం అంటేనే జగన్ అని వివరించారు అంబటి. ఆయనపై తప్పుడు రాతలు ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. ఇప్పుడు అధికారిక బాధ్యతలు లేవు కాబట్టి, మరింత ఎక్కువమందిని ఆయన కలిసే అవకాశముందన్నారు. చంద్రబాబు తన జీవితంలో ఎంతమంది ప్రజల్ని కలిశారో, అంతకు 10రెట్లు ఎక్కువ మందిని జగన్ ఇప్పటికే కలిసి ఉంటారని చెప్పుకొచ్చారు అంబటి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: