బాబుకు ముందుంది ముసళ్ల పండగ..వాళ్లను తట్టుకోవడం కష్టమే ?

Veldandi Saikiran

5 సంవత్సరాల తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ శ్రేణుల్లో  పదవుల పందేరం కొనసాగుతోందట. మంగళగిరిలో మకాం వేసి పార్టీ నేతలు తెగ ప్రయత్నాలు చేస్తున్నారట. పార్టీ గెలుపులో తమ వంతు పాత్ర పోషించిన నేతలు ఇప్పుడూ పదవులు కోరుకుంటున్నారట. ఇప్పుడు ఓడితే ఇక భవిష్యత్తు లేదన్నట్టు ఎన్నికల సమయంలో కష్టపడ్డ నేతలు ఏదో ఒక పదవిని ఆశిస్తున్నారట. వాస్తవానికి గత ఎన్నికల్లో పార్టీ ఓడిన తర్వాత దాదాపు ఏడాదిన్నర పాటు చాలామంది నేతలు కార్యాలయం వైపు రావడానికి కూడా భయపడ్డారు. జగన్ సర్కారులో అక్రమ కేసులు, కక్ష సాధింపు చర్యలు, దాడులకు దిగబడడంతో బయటికి వచ్చేందుకు కూడా ధైర్యం చేయలేరట.

అయితే ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో జరిగిన మహానాడు తర్వాత నేతలంతా వైసీపీ సర్కారుకు ఎదురు తిరగడం మొదలుపెట్టారట. నిత్యం ప్రజల్లోనే గడిపారట. అలా పార్టీ గెలుపులో తమ వంతు పాత్ర పోషించి అధికారంలోకి వచ్చారట. దీంతో ఇప్పుడు వారంతా ఏదో ఒక పదవిని ఆశిస్తున్నారట. పార్టీ కోసం కష్టపడిన నేతలంతా ఇప్పుడు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు వస్తాయని బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. కొందరు నామినేటెడ్ పదవుల కోసం ప్రయత్నిస్తే..... మరికొందరు పార్టీ పదవుల కోసం ఇప్పటికే దరఖాస్తులు కూడా చేసుకున్నారు. ఇందుకోసం కొందరు పదవుల కోసం పైరవీలు కూడా చేస్తున్నారట.

గతంలో పార్టీ పదవులు అనుభవించిన వారేమో.... నామినేటెడ్ పదవుల కోసం... అధికారం అనుభవించిన వారేమో....పార్టీ పదవుల కోసం ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు క్యాబినెట్ లో తెలుగు మహిళ మంగళపూడి అనిత హోం మంత్రి అయ్యారు. అయితే ఆ పదవి కోసం మహిళా నేతలు ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటివరకు ఆ పదవి ఎస్సీకి కేటాయించడంతో అదే సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రులు పీతల సుజాత, పనబాక లక్ష్మి, ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మ కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే లోక్ సభ ఎన్నికల్లో గ్రీష్మ తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ తరపున ప్రచారం చేయడంతో ఆ పేరును పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఎస్సీ సెల్ అధ్యక్ష పదవి కోసం లిస్ట్ పెద్దగానే ఉందట. రైతు సంఘం నేతగా శ్రీనివాసులు రెడ్డిని కంటిన్యూ చేస్తారన్నట్లు తెలుస్తోంది. బీసీ సెల్ నేతగా కొల్లు రవీంద్ర స్థానంలో ఎవరికి అవకాశం దక్కుతుందనే చర్చ ప్రస్తుతం జోరుగా నడుస్తోంది. అన్ని వర్గాల ప్రజలను కలుపుకుపోయే సీనియర్ నేతకు అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. ఇక కొత్త అధ్యక్షునిగా పళ్ళ శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టారు. మిగిలిన పార్టీ పదవులపై ఆయన కసరత్తులు చేస్తున్నారట. ఇలా  అందరినీ దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు పదవులు ఇవ్వాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: