పాపం పిఠాపురం వ‌ర్మా.. ప‌వ‌న్ ఇలా దెబ్బ కొట్టావేంటి బాసు...?

RAMAKRISHNA S.S.
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వర్మను చూసి ఇప్పుడు జాలి పడాల అన్న సందేహాలు అయితే కలుగుతున్నాయి. వర్మ పిఠాపురంలో చాలా బలమైన నాయకుడు. కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న ఆ నియోజకవర్గంలో కూడా ఇండిపెండెంట్గా అది కూడా 48 వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలిచిన నేత అంటేనే పిఠాపురంలో వర్మకు ఎంత పట్టు ఉందో తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో కూడా వర్మ పిఠాపురం నుంచి పోటీ చేయాలని గత ఐదేళ్లపాటు నియోజకవర్గం లో బాగా కష్టపడ్డారు. అనూహ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తాను 2019 ఎన్నికల్లో పోటీ చేసిన భీమవరం, గాజువాకను కాదని పిఠాపురం ఎంచుకున్నారు.

స్వయంగా జనసేన అధినేత పవన్ పిఠాపురంలో పోటీ చేస్తూ ఉండటం.. ఇటు టీడీపీ, బీజేపి, జనసేన పొత్తు ఉండడంతో వర్మ తన సీటును త్యాగం చేశారు. అయితే చంద్రబాబు స్వయంగా పిలిచి వర్మను ఎమ్మెల్సీ చేస్తానని హామీ ఇచ్చారు. పవన్ సైతం గెలిచాక వర్మను ప్రశంసలతో ముంచేత్తారు. వర్మ గట్టిగా సపోర్ట్ చేయడంతోనే పిఠాపురంలో పవన్ కు ఏకంగా 72,000 ఓట్ల భారీ మెజార్టీ దక్కింది. అయితే తాజాగా ఏపీలో రెండు ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యాయి. ఈ రెండు ఎమ్మెల్సీ పదవులకు ఈ నెల 12న ఉప ఎన్నిక జరుగుతుంది. చంద్రబాబు ఒక ఎమ్మెల్సీ సీటును జనసేనకు ఇవ్వగా... మరో స్థానాన్ని సీ. రామచంద్రయ్యతో భర్తీ చేశారు.

అయితే పవన్ పట్టుబడితే కచ్చితంగా వర్మకు ఎమ్మెల్సీ దక్కేది. ఆ ఒక సీటును తాను తీసుకుని తన రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ కు కట్టబెట్టారు. ఇక టీడీపీ నుంచి కూడా పవన్ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత సీ. రామచంద్రయ్యకు ఎమ్మెల్సీ పదవీ కట్టబెట్టారు. పవన్ ని ఏమాత్రం గట్టిగా పట్టుబట్టి ఉన్నా వ‌ర్మకు ఎమ్మెల్సీ దక్కేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ ఎందుకు వర్మ విషయంలో అంత గట్టి నిర్ణయంతో లేరని.. అందుకే వర్మ కు తొలివిడతలో దక్కాల్సిన ఎమ్మెల్సీ పదవి దక్కలేదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి తర్వాత జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో అయినా వర్మకు ఎమ్మెల్సీ వస్తుందా..? అప్పుడైనా పవన్ గట్టిగా పట్టుబడతారా..? అన్నది చూడాలి. అప్పటివరకు అయితే వర్మ ఎమ్మెల్సీ పదవి కోసం వేచి చూడక తప్పని పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: