ఘోరంగా ఓడించినా మార‌ని కేసీఆర్ తీరు... మ‌ళ్లీ అదే త‌ప్పు... !

RAMAKRISHNA S.S.
- పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో జీరో... వ‌రుస‌గా ఎమ్మెల్యేలు జంప్‌
- పార్టీ ఆఫీస్‌కు రాకుండా ఫామ్‌హౌస్‌లోనే
- ప్ర‌జ‌ల్లోకి రారు... ఈ కేసీఆర్ సారు
( హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ )
పదేళ్లపాటు తిరుగులేని అధికారాన్ని అనుభవించారు.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. అధికారంలో ఉన్నప్పుడు కెసిఆర్ తో పాటు కేసీఆర్ ఫ్యామిలీ ఎలా ఇష్టారాజ్యంగా ? వ్యవహరించారో చూసాం.. ఇక గత డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలోనూ టిఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఏమీ ఓడిపోలేదు. గౌరవప్రదమైన సీట్లు వచ్చాయి. హైదరాబాద్ ఓటరు వన్ సైడ్ గా బి.ఆర్.ఎస్ కు ఓట్లేసి తీర్పు ఇచ్చారు. అయితే గ్రామీణ ప్రాంత ఓటరు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. అధికారంలో ఉన్నప్పుడు అహంభావంతో వ్యవహరిస్తే.. ఒక్కసారి ప్రతిపక్షంలోకి వచ్చాక పరిస్థితి ఎలా ? మారిపోతుందో ఎంత దీనస్థితికి దిగజారిపోతామో కెసిఆర్.. టిఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్కరికి గుణపాఠం అని చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక ఐదు నెలల్లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో రాష్ట్ర మొత్తం మీద బిఆర్ ఎస్ పార్టీకి ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటు కూడా రాలేదు.

ఇప్పుడు లోక్‌స‌భలో బీఆర్ఎస్ కు అసలు ప్రాతినిథ్యం లేకుండా పోయింది. పార్టీ నుంచి గెలిచిన చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి లేదా ఇతర పార్టీల లోకి వెళ్ళిపోతున్నారు. ఓవైపు కుమార్తె క‌విత‌ ఢిల్లీలో జైల్లో ఉన్నారు. ఈ టైం లో కూడా కేసీఆర్ నేను చెప్పిందే నడవాలి.. నా మాటే శాసనం.. నేను ఉద్యమకారుడుగా, పార్టీ అధినేతగా, తెలంగాణ తెచ్చిన నాయకుడుగా 10 సంవత్సరాలు సీఎంగా ఉన్నాను. నా దగ్గరికి అందరూ రావాలి తప్ప.. నేను ఎవరి దగ్గరికి వెళ్ళను అన్న ఆలోచనలోనే ఉన్నట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రజలు ఇంత దారుణమైన తీర్పు ఇచ్చినా కేసీఆర్‌కు ఇంకా బుద్ధి రాలేదు అని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. ప్రజల వద్దకే పాలన.. ప్రజల వద్దకే పార్టీ అనేది సహజంగా రాజకీయ పార్టీల నినాదంగా ఉంటుంది.

కానీ కెసిఆర్ మాత్రం తాను కలవాలి అనుకున్న వారిని కలుస్తాడు తప్ప.. ఎవరిని కలవడని ఆయన ఒక దొరలా వ్యవహరిస్తారన్న విమర్శలు ఉండనే ఉన్నాయి. ఇక కేసీఆర్ మారకపోతే పార్టీ బతకదు అని ఆ పార్టీ నుంచి అందరూ బయటకు వెళుతున్నారు. కేసీఆర్ తిరిగి అసెంబ్లీకి వస్తారని.. పార్టీ ఆఫీసులో అందరికీ అందుబాటులో ఉంటారని.. భావిస్తున్న టైంలో కేసీఆర్ నిర్ణయాలు మళ్లీ కాంట్రవర్సీ అవుతున్నాయి. కొద్దిరోజులుగా ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు కేసీఆర్ ను కలుస్తున్నారు. కేసీఆర్ అందరికీ టైం ఇస్తున్నారని.. బీఆర్ఎస్ అనుకూల మీడియా చాటింపు వేస్తోంది. కానీ కెసిఆర్ ప్రతి ఒక్కరిని తన ఫామ్ హౌస్‌కు రప్పించుకుంటున్నారు... తాను చెప్పాలనుకున్నది చెప్పి పంపించేస్తున్నారు. గతానికి ఇప్పటికీ చిన్న తేడా ఏంటంటే.. కెసిఆర్ గతంలో సామాన్య కార్యకర్తలతో ఫోటోలు దిగే వారు కాదు. ఇప్పుడు ఖాళీగా ఉండడంతో నేతలు దగ్గరుండి ఫోటోలు చేయించుకుంటున్నారు. అంతకుమించి కేసీఆర్ లో కొత్తగా వచ్చిన మార్పు ఏమీ లేదని సొంత పార్టీ వాళ్లే చెవులు కొరుక్కుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: