అమరావతి: చంద్రబాబుపై మాజీ సీఎం అభాండాలు..!

FARMANULLA SHAIK
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరో స్థాయికి తీసుకెళ్లారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.'తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని ఒక నియంత బుల్డోజర్లతో కూల్చి వేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు, ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్లపాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తలొగ్గేది లేదు. వెన్నుచూపేది అంతకన్నా లేదు. ప్రజల తరఫున ప్రజల కోసం ప్రజలకు తోడుగా గట్టి పోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నా' అంటూ శనివారం సామాజిక మాధ్యమం లో పోస్టు చేశారు.తాజాగా ఆ పోస్టుకు స్పందిస్తూ టిడిపి శ్రేణులు జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.మాజీ సీఎం జగన్‌ నోరు విప్పితే పచ్చి అబద్ధాలు చెబుతారని మరోసారి తేలింది. తాడేపల్లి బోటుయార్డులోని రూ.కోట్ల విలువైన భూమిలో జల వనరుల శాఖ అనుమతి లేకుండా.. సీఆర్‌డీఏ, తాడేపల్లి-మంగళగిరి కార్పొరేషన్‌ల నుంచి పర్మిషన్‌ తీసుకోకుండా వైసీపీ కార్యాలయం కోసం అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాన్ని అధికారులు కూల్చివేయడంపై ఆయన గగ్గోలు పెడుతున్నారు.

అధికారులు ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండా కూల్చారని ఆరోపిస్తున్నారు. అయితే గత నెల రోజులుగా నోటీసులపై నోటీసులు ఇచ్చాక.. వైసీపీ నుంచి ఎలాంటి స్పందనా లేనందునే కూల్చివేతకు వారు ఉపక్రమించార ని తెలుస్తోంది. పైగా జగన్‌ సీఎంగా ఉన్నప్పుడే వైసీపీకి ఈ నోటీసులు అందడం గమనార్హం. అంతేకాదు.. ఆయన అధికారంలో ఉన్నప్పుడే.. సదరు భూమిని అప్పగించేది లేదని ఇంజనీర్‌-ఇన్‌-చీఫ్‌ సి.నారాయణరెడ్డి తేల్చిచెప్పారు. పైగా అక్రమ కట్టడాలు ఏవైనా ఉంటే కూల్చివేయాలని ఆదేశించారు. ఇవన్నీ కప్పిపుచ్చి ఇప్పుడు సీఎం చంద్రబాబుపై జగన్‌ అభాండాలు వేస్తున్నారు.అంటూ టిడిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.20నాటి నోటీసుకు వైసీపీ నాయక త్వం స్పందించకపోవడంతో మళ్లీ ఈ నెల 1న వారం రోజుల్లో అక్రమ నిర్మాణాలపై సంజాయిషీ ఇవ్వాలని కార్పొరేషన్‌ నోటీసు ఇచ్చింది. ఈ నోటీసును భవన నిర్మాణం చేపట్టిన రాంకీ సంస్థకు కూడా పంపింది. అయినా స్పందనలేకపోవడంతో ఈ నెల 14న కార్పొరేషన్‌ కమిషనర్‌ కూల్చివేత ఉత్తర్వులు జారీ చేశారు. షోకాజ్‌ నోటీసుకు సమాధానం ఇవ్వకుండా.. హైకోర్టును ఆశ్రయించామంటూ రాకీ సంస్థ ఈ నెల 17వ తేదీ రాత్రి 11.37 గంటలకు తెలియజేసింది. అయితే హైకోర్టు కూడా ఈ వ్యవహారంలో చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలనే సూచించడంతో సీఆర్‌డీఏ చట్టం సెక్షన్‌ 115 ప్రకారం అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: