షర్మిల ఉండగా జగన్ సీఎం కాలేడట పాపం?

Suma Kallamadi
షర్మిల, జగన్ రిలేషన్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడుకోవలసిన పనిలేదు. దాదాపు ఒక దశాబ్దకాలం కిందట జగనన్న వదిలిన బాణంగా చెప్పుకుని వైసీపీ తరఫున చాలా తీవ్రంగా ప్రచారం చేసిన చెల్లెలు షర్మిల 2024 ఎన్నికల్లో మాత్రం అన్నకి కొన్ని అనూహ్య కారణాలతో ఎదురుతిగింది. కట్ చేస్తే వైసీపీ ఎన్నడూ చూడని ఘోర ఓటమిని మూటకట్టుకుంది. దాంతో వైసీపీ బాగా డీలా పడింది. ఈ క్రమంలోనే కూటమి సంగతి పక్కన పెడితే వైసీపీని షర్మిల బాగా దెబ్బ తీసింది అనే మాటలు బాగా వినబడుతున్నాయి. ఈ ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓటు బ్యాంక్ తో వెనకబడి ఉన్న కాంగ్రెస్ ఒక్కసారిగా ముందుకు దూకింది. చాలా చోట్ల వేలల్లో ఓట్లు దక్కాయి. ఏకంగా 2.8 శాతం ఓటు షేర్ కాంగ్రెస్ కి ఈ ఎన్నికల్లో దక్కింది అంటే మాటలు కాదు.
ఇలా కాంగ్రెస్ కి వచ్చిన ఓట్లు అన్నీ దాదాపుగా వైసీపీ నుండి చీలినవే అని వేరే చెప్పాల్సిన పనిలేదు. అవును, ఏపీ ప్రెసిడెంట్ గా వైఎస్ షర్మిల బరిలో దిగడంతో పాటు జగన్ కి ఆమె వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో వైసీపీకి తీవ్ర నష్టం జరిగింది. దాంతో వైసీపీ ఓటు బ్యాంక్ తగ్గిపోయింది. నిజానికి వైసీపీకి 2014 నాటికి కూడా 45 శాతం ఓటు బ్యాంక్ ఉంది. కానీ ఆ గ్రాఫ్ కాస్త తగ్గి 39 శాతానికి పడిపోయింది. ఈ నేపధ్యంలో షర్మిల పీసీసీ చీఫ్ గా ఈసారి మరింత దూకుడు పెంచుతారు అని విశ్లేషకులు అంటున్నారు. ఆమె కేవలం మూడు నెలల కాలంలోనే తన సత్తా చాటుతూ వైసీపీకి దెబ్బ కొట్టారు. అదే ఆమె చేతిలో అయిదేళ్ల కాలం ఉంటే ఆమె ఎలాంటి ప్రభంజనం చూపిస్తారో ఆ దేవుడికెరుక.
ఈ నేపథ్యంలోనే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ మరింతగా పుంజుకుంటే అది వైసీపీ ఉనికికే పెనుప్రమాదంగా మారుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఫలితాలు వచ్చిన వెంటనే ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ అగ్ర నేతలను కలసి సంస్థాగతంగా కాంగ్రెస్ ని బలోపేతం చేస్తామని చెప్పినట్టు గుసగుసలు వినబడుతున్నాయి. ఇక వైసీపీ అధినేత జగన్ కి యాంటీగా పీసీసీ చీఫ్ గా షర్మిలను కొనసాగించాలని కాంగ్రెస్ నిర్ణయించడం వెనక వ్యూహాలు మనం ఊహించుకోవచ్చు. మరోవైపు కేంద్రంలో చూస్తే ఈసారికి బీజేపీ సొంత మెజారిటీని సాధించలేకపోయింది. దాంతో 2029 నాటికి కాంగ్రెస్ కేంద్రంలో జెండా ఎగరవేయనుందనే అంచనాలు పెరిగిపోయాయి. కాబట్టి ఆ ప్రభావం ఏపీలో కూడా గట్టిగానే ఉంటుంది. మొత్తానికి షర్మిల కాంగ్రెస్ చీఫ్ గా ఉన్నంతవరకూ వైసీపీకి జగన్ కి ఇబ్బందే అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: