ప్రధాన ప్రతిపక్ష హోదా ఉన్న పార్టీకి దక్కే సౌకర్యాలు.. హక్కులు ఇవే..?

Pulgam Srinivas
శాసనసభలో అయినా లోక్ సభలో అయినా అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అనే రెండు ఉంటాయి. ఎక్కువ అసెంబ్లీ లేదా పార్లమెంటు స్థానాలను దక్కించుకొని అధికారంలో ఉన్న పార్టీని అధికార పార్టీ అనగా, ఆ తర్వాత ఎక్కువ స్థానాలను దక్కించుకున్న పార్టీని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అని అంటారు. నిజానికి 1977 సంవత్సరం వరకు ప్రధాన ప్రతిపక్ష హోదాకు సంబంధించి ఎలాంటి అవసరం రాలేదు. ఏది అయితే రెండవ అతిపెద్ద పార్టీ ఉంటుందో దానికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేవారు.

కానీ తొలిసారి 1977లో కాంగ్రెస్ ఓటమి తర్వాత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అనే దానికి చట్టబద్ధత కల్పించారు. 1977 లో రూపొందించిన నిబంధనల ప్రకారం ప్రధాన ప్రతిపక్ష హోదా కలిగిన పార్టీ ప్రధాన నేతకు కొన్ని అధికారాలు, సౌకర్యాలు, హక్కులు కల్పించారు. కానీ సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలి అంటే ఆ పార్టీకి కచ్చితంగా 10% సీట్లు ఉండాలి. అలా సంపాదించుకున్న పార్టీకే అసెంబ్లీ లేదా పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా దక్కుతుంది. ఈ లెక్కన చూసుకున్నట్లు అయితే లోక్సభలో 55, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 18 స్థానాలు వచ్చిన పార్టీనే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కొనసాగుతుంది.

ఈ స్థానాలు ఇంతకంటే ఎక్కువ ఉన్నట్లు అయితేనే స్పీకర్ ఈ పార్టీని ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అనౌన్స్ చేస్తారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతకు క్యాబినెట్ మంత్రి హోదా ఉంటుంది. సభలో సీట్ల కేటాయింపులో విపక్షానికి ప్రాధాన్యం దక్కుతుంది. క్యాబినెట్ హోదా కలిగి ఉండడంతో పాటు పిఎస్,  పిఎ సహ సిబ్బంది అలవెన్సులు, దానికి అనుగుణమైన ప్రోటోకాల్ కూడా లభిస్తుంది. అలాగే సభలో చర్చల సమయంలో అనేక సార్లు స్పీకర్ ప్రధాన ప్రతిపక్ష నేతను సంప్రదించడం ఆనవాయితీ. సభలో ప్రశ్నలు వేసే విషయంలో కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఎక్కువ అవకాశం ఉంటుంది.

ఇలా ఎన్నో సౌకర్యాలు, హక్కులు ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న పార్టీకి దక్కుతాయి. ఇకపోతే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా జరిగిన ఎన్నికల్లో టిడిపికి 135, జనసేనకు 21, వైసీపీకి 11, బిజెపికి 8 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. దీనిని బట్టి చూస్తే జనసేనకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా రావాలి. కానీ టిడిపి, జనసేన, బిజెపి మూడు పొత్తులో ఉన్నాయి. కాబట్టి జనసేనకు ఆ హోదా ఇస్తారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. ఇక వైసిపి పార్టీకి మాత్రం దాదాపుగా ప్రధాన ప్రతిపక్ష హోదా దగ్గర లేనట్లే కనిపిస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఏ పార్టీ కొనసాగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: