మహిళ టీచర్లకు మంత్రి పదవులు!

Suma Kallamadi
ఏపీలో కొత్తగా ఏర్పడ్డ టీడీపీ కూటమి ప్రభుత్వం కొత్త పుంతలు తొక్కుతోంది. అవును, తన కేబినెట్లో మహిళలకు పెద్ద పీట వేస్తూ వారిని ప్రధమ స్థానంలో నిలబెట్టింది. దాంతో వారికి రాజకీయాల్లో దక్కిన విశిష్టత విషయంలో వారు చాలా ఆనందంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయులుగా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చిన వారు ఇపుడు ఏకంగా మంత్రులు అయిపోయారు. హోం మంత్రి వంగలపూడి అనిత రాజకీయాల్లోకి రాకముందు ఉపాధ్యాయురాలుగా పని చేసిన అనుభవం కలిగి ఉన్నారు. అలాగే మాజీ మంత్రి తానేటి వనిత కూడా ఎమ్మెల్యే కాకముందు కాలేజీలో లెక్చరర్‌గా ఉద్యోగం చేయడం జరిగింది. అదేవిధంగా మాజీ మంత్రి పీతల సుజాత సైతం ఉపాధ్యాయురాలుగా పని చేసిన అనుభవం కలిగిన వారే.
అందువలన టీచర్లందరూ ఏపీలో మంత్రులు అవుతున్నారనే నానుడి ఇపుడు జనాల్లో బాగా నానుతోంది. వంగలపూడి అనిత విషయానికొస్తే, గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. దాంతో ఆమె చంద్రబాబు మంత్రివర్గంలో కీలకమైన హోం శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. అనిత 2009లో ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఎంఏ, ఏంఈడి పూర్తి చేసి ఉపాధ్యాయురాలుగా బాధ్యతలు చేపట్టారు. అదే విధంగా దాదాపు ఐదు సంవత్సరాలు పాటు సుదీర్ఘంగా మంత్రిగా పనిచేసిన తానేటి వనిత ఒకప్పుడు ఉపాధ్యాయురాలే. వనిత 1995లో విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎంఎస్సీ, ఎంఈడి పూర్తి చేశారు.
ఇక మరో మాజీ మంత్రి పీతల సుజాత కూడా ఉపాధ్యాయులుగా పనిచేశారు. 2004లో తండ్రి వారసత్వంగా రాజకీయాలలోకి వచ్చిన సుజాత మొదటిసారి పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా జెండా ఎగర వేశారు. ఆ తర్వాత 2009లో నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా ఆచంట జనరల్ రిజర్వేషన్ కు మారిపోవడంతో ఆమె పోటీ చేయడం జరగలేదు. ఆ తర్వాత 2014లో చింతలపూడి నియోజకవర్గంలో నుంచి టీడీపీ అభ్యర్థిగా పీతల సుజాత పోటీ చేసి గెలుపొంది చంద్రబాబు నాయుడు కేబినెట్ లోనే స్త్రీ శిశు సంక్షేమ గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ రకంగా టీచరుగా పనిచేసి అనంతరం రాజకీయాలకు వచ్చిన మహిళ నేతలు తప్పకుండా మంత్రులు అవుతారనే ట్రెండ్ బాగా ఏపీలో వినబడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: