జ‌గ‌న్ అర్జెంటుగా చేయాల్సిన ఫ‌స్ట్ ప‌ని ఇదే..!

RAMAKRISHNA S.S.
వైసీపీ అధినేత జ‌గ‌న్ ముందుగా చేయాల్సిన ప‌ని ఏంటి? ఎప్పుడో ప్ర‌జ‌ల్లోకి వ‌స్తాన‌ని ఆయ‌న చెప్పారు. కానీ, ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చేందుకు ముందుగానే ఆయ‌న చేయాల్సిన కీల‌క ప‌ని ఒక‌టుంది. అదే.. గ్రామీణ ప్రాం తాల్లో పార్టీని.. నాయ‌కుల‌ను నిల‌బెట్టుకోవ‌డం. ముఖ్యంగా గ‌త స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఎంపీటీసీలు.. జెడ్‌పీటీసీలు పెద్ద ఎత్తున వైసీపీ త‌ర‌ఫునే ఎన్నిక‌య్యారు. అదేవిధంగా కార్ప‌రేష‌న్లు అన్నింటిలోనూ.. వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది.

ఇది ఒక అసాధార‌ణ విజ‌యం. రేపు 2029 నాటికి పార్టీ మ‌ళ్లీ పుంజుకునేందుకు కూడా.. వీరు క్షేత్ర‌స్థాయి లో పార్టీకి అవ‌స‌రంగా మారుతున్నారు. ఇప్పుడు జ‌రిగింది ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టు కుంటే మాత్రం వైసీపీకి స్థానిక సంస్థ‌లు కీల‌కంగా మార‌నున్నాయి. దీంతో వీటిని మ‌రింత బ‌లంగా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవ‌స‌రం ఉంది. అయితే.. ఇక్క‌డే పెద్ద స‌మ‌స్య వైసీపీని కాచుకుని ఉంది. స‌హ‌జంగానే ప్ర‌భుత్వం మారితే.. స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధులు జెండా మార్చేస్తున్నారు.

తెలంగాణ‌లో నిన్న మొన్న‌టి వ‌ర‌కు బీఆర్ ఎస్ త‌ర‌ఫున చ‌క్రం తిప్పిన నాయ‌కులు కూడా.. స‌ర్కారు ప‌డిపోగానే.. కాంగ్రెస్ అధికారంలోకిరాగానే.. అటు వైపు వెళ్లిపోయారు. దీనిని ఎవ‌రూ త‌ప్పు ప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే.. స్థానికంగా ప‌నులు చేయించాలంటే.. నిధులు కావాలి. ఈ నిధులు రావాలంటే.. అధికార ప‌క్షానికి జై కొట్టి తీరాల‌న్న నానుడి కూడా ఉంది. దీంతో నే తెలంగాణ‌లో నాయ‌కులు కాంగ్రెస్‌కు జై కొట్టారు. ఇప్పుడు ఏపీలోనూ ఇలాంటి ప‌రిస్థితి వ‌చ్చిన ఆశ్చ‌ర్యం లేదు.

పైగా తెలంగాణ‌లో కంటే కూడా.. ఏపీలో కూట‌మి పార్టీ అత్యంత బ‌లంగా ఉంది. 164 సీట్ల‌తో కూట‌మి ప్ర‌భుత్వం ఉంది. ఈ నేప‌థ్యంలో ఈ ప్ర‌బుత్వం నుంచి నిధులు రావాలంటే.. ఖ‌చ్చితంగా స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు అటు వైపు మ‌ళ్లుతార‌నే చ‌ర్చ సాగుతోంది. ఇదే జ‌రిగితే.. వైసీపీకి మ‌రింత డ్యామేజీ వ‌స్తుంది. ఈ నేప‌థ్యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ముందుగా వారిని టార్గెట్ చేసుకుని.. వారు పార్టీ మార‌కుండా.. చూసుకోవాల్సిన అవ‌స‌రం .. భ‌రోసా  క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని  అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: