ఏపీలో పార్టీలన్నీ ఎన్డీయేకే మద్దతిస్తున్నాయేంటి?

Suma Kallamadi
ఏపీలో ఉన్న పార్టీలన్నీ దాదాపుగా ఎన్డీయేకే జేజేలు కొడుతున్నాయి. గతసారి అధికారంలో ఉన్న వైసీపీ ప్రస్తుతం ప్రతిపక్షం కూడా దక్కించుకోలేక పోయింది. ఇక గతసారి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఇపుడు అధికారంలోకి వచ్చింది. జస్ట్ అటు ఇటు అయింది కానీ ఎటువంటి మార్పు లేదు.. ఆయా పార్టీలన్నీ ఇపుడు ఎన్డీయేకే మద్దతు తెలిపినట్టు చాలా స్పష్టంగా కనబడుతోంది. లోక్ సభ స్పీకర్ కి ఎన్నిక బుధవారం జరుగుతున్న నేపధ్యంలో వైసీపీ తన నిర్ణయాన్ని ప్రకటించినట్లుగా ప్రచారం జరుగుతున్న విషయం అందరికీ తెలిసినదే. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే నిలబెట్టిన లోక్ సభ అభ్యర్థి ఓం బిర్లాకు మద్దతు ఇవ్వడానికి వైసీపీ నిర్ణయం తీసుకుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈ మేరకు బీజేపీ వర్గాలు వైసీపీ అధినేతను బుజ్జగించినట్టు తెలుస్తోంది. దానికి వైసీపీ నుంచి మద్దతు వచ్చిందని అంటున్నారు. దాంతో లోక్ సభలో ఎన్డీయే బలం ఏకంగా 297కి పెరగడం కొసమెరుపు. నలుగురు వైసీపీ ఎంపీల మద్దతుతోనే ఈ స్కోర్ పెరిగిందని ఇక్కడ వేరే చెప్పుకోవలసిన పనిలేదు. ఏపీ నుంచి చూస్తే 25 మంది ఎంపీలు గెలిచారు. అందులో ఎన్డీయే కూటమి నుంచి 21 మంది గెలిస్తే, వైసీపీ నుంచి నలుగురు గెలిచారు. దాంతో ఇపుడు 25 మంది ఎన్డీయేలో ఉన్నట్లుగా తేటతెల్లం అయింది. ఇకపోతే బీజేపీకి సౌత్ లో పెద్దగా బలం లేదు. నార్త్ లో కొన్ని స్టేట్స్ లో బీజేపీకి 25 ఎంపీల బలం ఉండవచ్చు. కానీ సౌత్ లో ఒక స్టేట్ లో మొత్తానికి మొత్తం ఎంపీల మద్దతు ఈ విధంగా లభించడం అంటే అది ఎన్డీయే గేమ్ ప్లాన్ అని అనేక తప్పదు.
ఇటువంటి తరుణంలో ఏపీకి కేంద్రం ఏం వెలగబెట్టిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీకి ఈ రోజున కేంద్రంలో సొంత బలం లేదు దాంతో ఏపీ నుంచే 25 మంది ఎంపీలు కొమ్ము కాసే పరిస్థితి వచ్చింది. గతం సంగతి పక్కన పెడితే ఈసారైనా కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తే బావుంటుందని విజ్ఞులు భావిస్తున్నారు. అంతే కాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపడం కావచ్చు విభజన హామీలను నెరవేర్చడం కావచ్చు... ఇలా ఎన్నో రకాల సమస్యలను తీర్చుకోవడానికి ఇదే మంచి తరుణం అని ప్రజలు కూడా ఫీల్ అవుతున్నారు. అలా కాకుండా ఎన్డీయేకు మద్దతు ఇవ్వడం అన్నది ఎవరికి వారుగా తమ రాజకీయ కోణాలలోనే చూసుకుంటే మాత్రం రాష్ట్రం దాని ప్రగతి పక్కకు పోతాయనే చెప్పుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: