అయ్య‌న్న‌కు ఆ ప్ర‌మోష‌న్ కోస‌మే మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేదా..!

RAMAKRISHNA S.S.
- అయ్య‌న్న‌కు త‌గిన గౌర‌వం.. స్పీక‌ర్ ప‌ద‌వితో స‌రి
- సీనియ‌ర్ల‌కు మొండి చేయి నేప‌థ్యంలో అయ్య‌న్న ఆశ‌లు ఆవిరి
( ఉత్త‌రాంధ్ర - ఇండియా హెరాల్డ్ )
ఆయ‌న నోరు విప్పితే..చురుక్కులు.. చెమ‌క్కులు.. ప్ర‌తిప‌క్షాల‌పై ప‌దునైన వ్యాఖ్య‌లు కామ‌న్‌. ఎవ‌రినీ నొప్పించిన‌ట్టు ఉండ‌దు. కానీ, ఆయ‌న మాట‌ల్లోనే కారం ఉంటుంది. ప‌దాల్లో మ‌సాలా క‌నిపిస్తుంది. ఆయ‌నే.. చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు. ఈ పేరు చెప్ప‌గానే.. విన‌గానే గుర్తుకు వ‌చ్చేది టీడీపీ. ఆ పార్టీలో అంత నిబ‌ద్ధ‌త‌తో ఆయ‌న ప‌నిచేస్తున్నారు. అన్న‌గారు ఎన్టీఆర్ హ‌యాం నుంచి కూడా అయ్య‌న్న పార్టీకి అండ‌గా ఉన్నారు.

సుదీర్ఘ రాజ‌కీయ జీవితంలో ఆయ‌న పెద్ద‌గా సంపాయించుకున్న‌ది కూడా ఏమీ లేద‌ని ఆయ‌న అనుచ‌రు లు పార్టీ నాయ‌కులు కూడా చెబుతారు. గ‌తంలో అన్న‌గారి హ‌యాంలోనే మంత్రిప‌దవిని చేశారు. 25 ఏళ్ల వ‌య‌సులోనే రాష్ట్ర మంత్రిగా ప‌నిచేశారు. త‌ర్వాత‌.. చంద్ర‌బాబు హ‌యాంలోనూ అట‌వీ శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్నారు. ఇక న‌ర్సీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గంనుంచి తాజా ఎన్నికల్లో విజ‌యం ద‌క్కించుకున్న అయ్య‌న్న మంత్రి ప‌ద‌విపై స‌హ‌జంగానే ఆశ‌లు పెట్టుకున్నారు.

కానీ, అనూహ్యంగా ఆయ‌న‌కు ప‌ద‌వి చిక్క‌లేదు. వాస్త‌వానికి విశాఖ జిల్లాకు చెందిన అనేక మందిమంత్రి ప‌ద‌వుల‌పై ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ, ఒక్క వంగ‌ల‌పూడి అనిత‌కు త‌ప్ప‌.. ఎవ‌రికీ ప‌ద‌వీ యోగం ల‌భిం చ‌లేదు. ఈ జాబితాలో చాలా మందే ఉన్నారు. అయ్య‌న్న విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం వినిపిస్తున్న టాక్ ప్ర‌కారం.. ఆయ‌న‌కు శాస‌న‌స‌భ స్పీక‌ర్ ప‌ద‌విని అప్ప‌గించే అవ‌కాశాలు ఉన్నాయి. వ‌య‌సు రీత్యా.. మరో సీనియ‌ర్‌నేత‌.. బుచ్చ‌య్య చౌద‌రి పెద్దాయ‌న కావ‌డంతో అయ్య‌న్న‌కు ఈ ప‌ద‌విని అప్ప‌గించే అవ‌కాశం ఉంది.

సీనియార్టీ స‌హా.. ఉమ్మ‌డి ఏపీ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కూడా.. అనేక స‌భ‌ల్లో అయ్య‌న్న కీల‌క పాత్ర పోషించా రు. స‌భా వ్య‌వ‌హారాల‌ను న‌డిపించ‌డంలోనూ ఆయ‌న అనేక సంవ‌త్స‌రాలు నిశితంగా ప‌రిశీలించారు. దీంతో ఆయ‌నైతే.. ఏపీ అసెంబ్లీకి మ‌రింత వ‌న్నె వ‌స్తుంద‌న్న అంచ‌నాలు కూడా ఉన్నాయి. దీనికితోడు ఇప్పుడు ప్రతిప‌క్షం లేదు. ఈ నేప‌థ్యంలో స‌భ‌ను మ‌రింత జాగ్ర‌త్త‌గా న‌డిపించాల్సి ఉంటుంది. దీంతో అయ్య‌న్న అయితేనే క‌రెక్ట్ అనే భావ‌న సీఎం చంద్ర‌బాబులో క‌నిపిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేద‌ని అంటున్నారు ప‌రిశీలకులు. చూడాలి.. మ‌రి ఏంజ‌రుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: