గంటా శ్రీనివాస్ కు నిరాశే మిగిల్చిన చంద్రబాబు ?

Veldandi Saikiran
టీడీపీ సీనియర్ నాయకులు గంటా శ్రీనివాసరావుకు టీడీపీ గట్టి షాక్ ఇచ్చింది. ఏపీ కేబినెట్ కూర్పుపై రాజకీయ వర్గాల్లో రకరకాల విశ్లేషణలు మొదలయ్యాయి. సీనియారిటి అనే సంబంధం లేకుండా సమర్థత ఉన్న వారిని మాత్రమే ఎంపిక చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఉత్తరాంధ్రకు చెందిన ఈ కాపు నేత గంటా శ్రీనివాసరావు పార్టీ పోటీ చేసిన సీటుతో సంబంధం లేకుండా వరుస విజయాలు సాధిస్తున్నారు. రాజకీయంగా ట్రబుల్ షూటర్ ఇమేజ్ ఉంది. 1999లో అనకాపల్లి ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేసి తొలిసారి విజయం సాధించారు. ఇక 2004, 2009, 2014, 2019లో ఓటమన్నది లేకుండా వరుసగా ఎమ్మెల్యేగా విజయాన్ని అందుకున్నారు గంటా.

ప్రజారాజ్యం విలీనం తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో తొలిసారి మంత్రి పదవి దక్కింది. 2014లో తిరిగి టీడీపీ తరపున భీమిలి నుంచి గెలిచి చంద్రబాబు కేబినెట్లో ఐదేళ్లు పనిచేశారు. సరిగ్గా ఇక్కడి నుంచి గంటా హవాకు బ్రేక్స్ వేసే అంతర్గత వ్యవహారాలు మొదలయ్యాయని పార్టీలో టాక్ వినిపించింది. ఉత్తరాంధ్ర కాపు కోటాలో బలమైన నేతగా ఎదిగిన గంట శ్రీనివాసరావు అప్పట్లో అతి నాయకత్వంతో విభేదించారు. అందుకు తగ్గట్టుగానే అసెంబ్లీ సమావేశాలకు, మంత్రివర్గ భేటీలకు డుమ్మా కొట్టడం చర్చనీయాంశమయ్యింది.

ఇక 2019లో భీమిలి నుంచి విశాఖ ఉత్తరానికి మారిన గంట శ్రీనివాస తన కెరియర్ లోనే స్వల్ప మెజారిటీతో గెలిచి ఊపిరి పీల్చుకున్నారు. అప్పటికే అధినాయకత్వంతో గ్యాప్ పెరగడంతో నియోజకవర్గంలో అంటిముట్టనట్టుగా వ్యవహరించారు. ఆ కారణంగా నార్త్ నియోజకవర్గంలో టీడీపీ పార్టీ సరైన నాయకత్వం లేకుండా ఇబ్బందులు పడిందని అభిప్రాయం పార్టీ పెద్దలకు ఉందట. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వం  ప్రకటించిన విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నిర్ణయాన్ని స్వాగతించి హైకమాండ్ ఆగ్రహానికి గురయ్యారు. చివరికి అది ఉత్తరాంధ్ర నాయకత్వం ఆకాంక్ష అయినప్పటికీ అమరావతి ఒక్కటే రాజధాని అని పార్టీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంపై పార్టీ తన విధానం ప్రకటించక ముందే ఛాన్స్ తీసుకున్నారు గంటా శ్రీనివాసరావు.
తన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు ఉక్కు కార్మిక సంఘం నుంచి ఎవరు పోటీ చేసిన ఉప ఎన్నికల్లో గెలిపించుకునే బాధ్యత తీసుకుంటానని ప్రకటించడం ద్వారా టీడీపీ నాయకత్వాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు గంట. ఆ దెబ్బకు స్టీల్ ప్లాంట్ పోరాటంలో టీడీపీ కీలక భాగస్వామిగా మారడం అనివార్యమైందన్న అభిప్రాయం ఉంది. రాజకీయంగాను 2019 తర్వాత గంట సేఫ్ గేమ్ ప్లాన్ చేశారనే ప్లాన్ విస్తృతంగా జరిగింది. వైసీపీలో చేరేందుకు పలుమార్లు సంప్రదింపులు జరిగాయన్న పబ్లిసిటీ జరిగింది. దీంతో గంటా శ్రీనివాసరావు ఎత్తుగడలు తరచూ చర్చనీయాంశంగా ఉండేవి. ఈ పరిస్థితుల్లో 2024 ఎన్నికలు మాజీ మంత్రిని విపరీతంగా టెన్షన్ పెట్టాయట. ఆఖరి నిమిషం వరకు సీట్ ఖరారు చేయని అధిష్టానం చీపురుపల్లి వెళ్లాలని గట్టిగానే చెప్పింది. అయితే చివరికి తాను కోరుకున్న భీమిలి టికెట్ సాధించుకున్న గంట శ్రీనివాసరావు 92 వేలకు పైగా మెజారిటీ సాధించారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు మరోసారి మంత్రి పదవి తెచ్చి పెడుతుందని అంచనా వేశారట సన్నిహితులు. కానీ గంటా శ్రీనివాసరావుకు నిరాశే ఎదురు అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: