పవన్‌ కళ్యాణ్‌: ఏపీ సీఎంగా చంద్రబాబే ఉండాలి !

Veldandi Saikiran
సీఎంగా చంద్రబాబు పేరును ప్రతిపాదించారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర విజయవాడలోని A1 కన్వెన్షన్ సెంటర్‌లో ఎన్డీయే కూటమి నేతల సమావేశం కొనసాగుతోంది. కూటమి నేతలంతా సమిష్ఠిగా పోరాటం చేసి అద్భుతమైన విజయాన్ని సాధించామని జనసేన అధినేన పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రజల నమ్మకాన్ని పెంచామన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలు మనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని తెలిపారు. చంద్రబాబును పేరును పవన్ కల్యాణ్ ప్రతిపాదించారు.

చంద్రబాబు కు హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు పవన్‌ కళ్యాణ్‌. కూటమి అద్భుత విజయం సాధించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించిన విజయమన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని 2021లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం, తగ్గాము, నిలబడ్డామని వివరించారు. క్లిష్ట పరిస్థితుల్లో  ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం ఉన్నప్పుడు సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు కావాలని స్పష్టం చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌.

చంద్రబాబు అనుభవం, నాయకత్వం ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి ఎంతో అవసరమన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌. ఎన్డీఏ కూటమి శాసనసభ పక్షానేత గా చంద్రబాబు పేరు ప్రతిపాదించి బలపరుస్తున్నానని వివరించారు. అద్భుత మెజార్టీతో 164 స్థానాలను కూటమి దక్కించుకుందని తెలియజేశారు. ఎన్డీయే కూటమి 21 లోక్‌సభ స్థానాలను దక్కించుకుందని... ఎన్డీయే కూటమి విజయం దేశం మొత్తానికి స్ఫూర్తినిచ్చిందని వివరించారు పవన్‌ కల్యాణ్‌.

ఇక ఈ సందర్భంగా  బీజేపీ పార్టీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.... ప్రజా వ్యతిరేక పాలన అంతమొందించేందుకు ప్రజలు కసిగా ఓట్లేశారన్నారు. విజయం నుంచీ పాఠాలు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. మూడు పార్టీల లక్ష్యం ప్రజా సంక్షేమమేనని వివరించారు. 3 పార్టీల కలయిక త్రివేణి సంగమం లాంటిదని తెలిపారు దగ్గుపాటి పురంధేశ్వరి. సభానాయకుడిగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రతిపాదనను నేను సమర్ధిస్తున్నానన్నారు. ఇక చివరగా చంద్రబాబును సభా నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: