రామోజీ ఫిలిం సిటీ వివరాలు మొత్తం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే?

Suma Kallamadi
తెలుగు పత్రికా ప్రపంచంలో మకుటం లేని మహారాజుగా వెలుగొందిన రామోజీ రావుగారు ఇక లేరనే బాధను యావత్ తెలుగు రాష్ట్రాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఆయన పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది రామోజీ ఫిలిం సిటీ. రామోజీరావు 1996లో స్థాపించిన ఈ ఫిలిం సిటీ పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధిగాంచింది. అయితే దీని గురించి జనాలు తరచూ వింటారు గానీ పూర్తి వివరాలు మాత్రం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. రామోజీ ఫిలిం సిటీ సుమారు 2000 ఎకరాలలో విస్తరించి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలింసిటీగా పేరు గడించింది. ఈ ఫిలిం సిటీలో మన తెలుగు సినిమాలే కాకుండా దేశ, విదేశాలకు చెందిన అనేక భాషా చిత్రాలు, టెలివిజన్ సీరియళ్లు నిర్మించబడుతున్నాయి అంటే ఇక అర్ధం చేసుకోవచ్చు.
ఈ ఫిలిం సిటీలో సినిమా దృశ్యాలకు కావలసిన రకరకాల ఫిక్స్డ్ సెట్స్ అనేకం ఉంటాయి. ఇక ఉద్యానవనాలకైతే లెక్కేలేదు. ఇక్కడికి వెళ్లి మొత్తం తిరిగి చూడాలంటే పర్యాటకులకు కనీసం వారం రోజులైనా పడుతుంది. ప్రపంచంలోనే లార్జెస్ట్‌ ఇంటిగ్రేటెడ్‌ ఫిల్మ్‌సిటీ ఇన్‌ ది వరల్డ్‌గా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం పొందిన ఈ ఫిల్మ్‌సిటీలో హాలీవుడ్ చిత్రాలు సైతం షూటింగ్ జరుపుకుంటాయి అంటే మీరు అర్ధం చేసుకోండి. ఇక్కడికి రాని ఇండియన్ సినీ ప్రముఖులు లేరు. ఏడాదికి సగటున 13 లక్షల మంది పర్యాటకులు ఫిల్మ్‌ సిటీని సందర్శిస్తున్నారని లెక్కలు చెబుతున్నాయి. ఉర్దూ నుంచి కన్నడం వరకు, గుజరాతీ నుంచి బంగ్లా వరకు ఎన్నో ప్రాంతీయ భాషల్లో టెలివిజన్‌ ఛానళ్లను తెలుగు నేలపై ఆవిష్కరించడం ఒక్క రామోజీరావుకు మాత్రమే చెల్లింది.
ఈ ఫిల్మ్ సిటీతో పాటు "ఉషాకిరణ్ మూవీస్" అనే ప్రొడక్షన్ హౌస్‌ను రామోజీరావు స్థాపించి అనేక సినిమాలను చిత్రీకరించారు. అందులో దాదాపుగా అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ఈ ఫిల్మ్ సిటీలో దాదాపు 2500కు పైగా సినిమాల చిత్రీకరణ జరిగినట్లు సమాచారం. ఇక్కడ చిత్రీకరించి ప్రపంచంలోనే అత్యధికంగా ప్రాచుర్యం పొందిన సినిమాలు కొన్ని ఉన్నాయి.  అందులో చెన్నై ఎక్స్‌ప్రెస్, క్రిష్, బాహుబలి మరియు డర్టీ పిక్చర్ ఉన్నాయి. అంతేకాకుండా తెలుగులో అనేక సినిమాలు ఇక్కడ రూపొంది బ్లాక్ బస్టర్ గా నిలిచినవీ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: