ఏపీలో కొత్త ప్రభుత్వంలో కొలువుదీరనున్న వాలంటీర్లు.. వారు చేసే విధులు ఇవేనా?

Suma Kallamadi
ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థపై ప్రస్తుతం తీవ్ర చర్చ సాగుతోంది. ఈ వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు, పవన్, లోకేష్ గతంలో విమర్శలు చేశారు. వాలంటీర్ల ద్వారా వైసీపీ పెద్దలు సమాచారం సేకరిస్తున్నారని పవన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వేల సంఖ్యలో అమ్మాయిలు మిస్ అవడానికి దీనికి సంబంధం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పవన్‌పై కొందరు వాలంటీర్లు కేసులు కూడా పెట్టారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయం వచ్చే సరికి వాలంటీర్లకు చంద్రబాబు వరాలు ఇచ్చారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందని చెప్పారు. అంతేకాకుండా రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 సీట్లతో అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తూనే దీనికి కొన్ని మార్పులు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
ఎన్నికల సమయంలో చంద్రబాబు చాలా హామీలు ఇచ్చారు. దానికి తగ్గట్టే గతంలో ఎన్నడూ లేని రీతిలో మెజార్టీ వచ్చింది. దీంతో హామీల అమలుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధానమైన వాటిలో వాలంటీర్ల వ్యవస్థ కూడా ఉంది. గతంలో 50 ఇళ్లకు ఒకరు చొప్పున వాలంటీర్లను వైసీపీ ప్రభుత్వం నియమించింది. వారికి కేవలం రూ.5 వేలు మాత్రమే ఇచ్చే వారు. అయితే ప్రస్తుత ప్రభుత్వంలో వాలంటీర్లకు రూ.10 వేల చొప్పున టీడీపీ కూటమి ప్రభుత్వం ఇవ్వాలని భావిస్తోంది. అంతేకాకుండా గ్రామానికి ఐదుగురు వాలంటీర్లను నియమించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే త్వరలోనే నోటిఫికేషన్ రానున్నట్లు సమాచారం. అంతేకాకుండా దీనికి సంబంధించి ప్రస్తుతం విధివిధానాల రూపకల్పన జరుగుతోంది. అంతేకాకుండా దీనికి కొన్ని నిబంధనలను విధించనున్నారు. వాలంటీర్లంతా డిగ్రీ ఉత్తీర్ణత చెంది ఉండాలి.


అంతేకాకుండా 1994 నుంచి 2003 మధ్య జన్మించిన వారు వాలంటీర్ల పోస్టులకు అర్హులు అన్నట్లు తెలుస్తోంది. మరో వైపు గ్రామాల్లో సచివాలయ వ్యవస్థను పూర్తిగా సర్పంచుల అధీనంలో ఉండేలా చూడనున్నారు. వీటికి అదనంగా సర్పంచులకు మరిన్ని అధికారులు ఉండేలా చూడడంతో పాటు ప్రతి గ్రామానికి ప్రత్యేక సంక్షేమ నిధి కేటాయించనున్నారు. ఇక వాలంటీర్ల ద్వారా పింఛనుదారులకు నేరుగా పింఛను అందించాలా లేక వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేయాలా అనే దానిపై ఆలోచన చేస్తున్నారు. ఇవన్నీ కేవలం ప్రతిపాదన దశలోనే ఉన్నాయని, వీలైనంత త్వరలో వీటికి రూపకల్పన జరుగుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: