వైసీపీ ఇక గట్టెక్కేనా?

Suma Kallamadi
ఆంధ్రాలో అభివృద్ధి నినాదం ముందు వైసీపీ నవరత్నాల మంత్రం ఎంతమాత్రమూ ప్రభావం చూపలేకపోయింది. కుప్పలు తెప్పలుగా అప్పులు తీసుకొచ్చి మరీ వెల్ఫెర్ స్కీంల కోసం జగన్ బటన్ నొక్కినప్పటికీ జనాలు మాత్రం ఫ్యాన్ గుర్తుకి బటన్ నొక్కడం కాదుకదా... ఆమాత్రం కూడా టచ్ చేయలేని పరిస్థితి. దాంతో వైసీపీ ఓట్లను రాబట్టలేకపోయింది. వైనాట్ 175 అన్న నానుడిని జనాల్లోకి తీసుకెళ్లిన జగన్ దానిని కార్యరూపం దాల్చడంలో మాత్రం పూర్తిగా విఫలం అయ్యారు. 2019లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ ఎక్కువగా సంక్షేమ పథకాలవైపే ఫోకస్ పెట్టింది. సంక్షేమం పథకాలు అందిస్తే చాలు ప్రజలు తన వెంట నడుస్తారని జగన్ బాగా నమ్మారు.
ఈక్రమంలోనే డీబీటీల ద్వారా లబ్ధిదారుల అకౌంట్లలో డైరెక్టుగా డబ్బులు పడేలా పథకాలను తీసుకురావడం జరిగింది. నవరత్నాల్లో భాగంగా ప్రతి ఇంటికి లబ్ది చేకూర్చేలా పర్‌ఫెక్ట్ ప్లాన్‌ చేశారు. సామాజిక పెన్షన్లు నుండి ఆరోగ్యశ్రీ, రైతు భరోసా, అమ్మఒడి, ఫీజు రియింబర్స్‌మెంట్ ఇలా ఒక్కటేమిటి ఎన్నో పథకాల ద్వారా డైరెక్టుగా బెనిఫియరీస్ అకౌంట్లలో డబ్బులు జమ చేశారు. కానీ జనాలు మాత్రం ఉపేక్షించలేదు. సంక్షేమ పధకాలు ఎవడికి కావాలి? రాష్ట్రాభివృద్ధి ఎక్కడ? అంటూ ఓట్ల రూపంలో ప్రశ్నించారు. అవును, దాదాపు ఇలాంటి ఓటమి దేశంలో మరీ పార్టీ చవిచూడలేదేమో అన్న విధంగా వైస్సార్సీపీని జనాలు ఓడించారు.
ఎంతలా ఓడించారంటే ప్రస్తుతం వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితి. ఇలాంటి తరుణంలో వైసీపీ కేడర్లో ఒకటే ప్రశ్న మెదులుతోంది. అసలు ఈ గడ్డు పరిస్థితినుండి ఎలా బయటపడేదని? ప్రస్తుతం నెగ్గిన 11 మందిని కాపాడుకుంటే అదేచాలు అన్న పరిణామం వైసీపీకి ఎదురైందని గుసగుసలు వినబడుతున్నాయి. ఇక ఎందుకు అంత దారుణంగా ఓడిపోయింది అన్న దానిపైన సమీక్షించుకుంటే సంక్షేమాన్ని నమ్ముకున్న సీఎం జగన్.. మరోవైపు అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేశారనే విమర్శలు ఉన్నాయి. గతుకుల రోడ్లతో సహా గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోవడం పెద్ద మైనస్. యువతకు ఉద్యోగాలు కల్పించలేకపోయారనే విమర్శలు, వాలంటీర్లు ఉద్యోగాలే పెద్ద ఉద్యోగాలన్నట్లు చేసిన హడావిడి జగన్ ఓటమికి ప్రధాన కారణాలుగా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: