అసలు సిసలైన వెన్నుపోటుదారుడు చంద్రన్న కాదు... ఏపీ ప్రజలే..??

Suma Kallamadi
ఏపీ మాజీ సీఎం జగన్ కి ప్రజలు వెన్నుపోటు పొడిచారా? జగన్ ఇచ్చిన డబ్బులన్నీ తీసేసుకొని చివరికి కనీసం 20 సీట్లు కూడా ఆయనకు ఇవ్వకుండా మోసం చేశారా? మహిళలు వృద్ధులు చిరు వ్యాపారులు అందరూ కూడా ఆయనకే వ్యతిరేకంగా ఓటు ఎందుకు వేశారు? అనే ప్రశ్నలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా వ్యక్తం అవుతున్నాయి.ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే జగన్ 53 లక్షల తల్లులకు ఏటా రూ.15,000 చొప్పున అందజేశారు. ఆయన చేపట్టిన చేయూత ద్వారా 1.05 కోట్ల మంది మహిళలు ఆర్థిక సహాయం పొందారు. 66 లక్షల మంది అవ్వాతాతలు బయట అడుగు పెట్టకుండానే అత్యధిక పెన్షన్ అందుకున్నారు. నవరత్నాల పేరిట మధ్యలో ఎవరూ లేకుండా నేరుగా ప్రజల బ్యాంకు అకౌంట్ ను డబ్బులు జమ చేశారు జగన్.
వీరందరూ కృతజ్ఞతా భావంతో తమకు ఓట్లు వేస్తారని జగన్ అనుకోవడమే పెద్ద తప్పు అయింది. ఈరోజు తిని రేపు మూతి తుడుచుకునే వాళ్లే ప్రజలు అని జగన్ గుర్తించకపోవడం బాధాకరం. ప్రజలు 10,000 ఇస్తే సంబరపడతారు, అదే 15,000 ఇస్తానని వేరే వారు చెప్తే ఆశపడి వారి వైపే వెళ్తారు. ఉచిత బస్సు, ఫ్రీ కరెంటు, పెన్షన్ ఎక్కువ ఇస్తామని చంద్రబాబు చెప్పడంతో వెంటనే నమ్మేసి ఆయనకే ఓట్లు గుద్దేశారు. చంద్రబాబు చారడంతా జాబితాతో హామీలను ఇచ్చినా వాటిని నెరవేర్చడం చాలా అరుదు. ఆయన అధికారంలోకి వచ్చినా, ప్రజలకు, రాష్ట్రానికి ఏమీ చేయరని గతంలో ఏపీ ప్రజలే ఆయనకు ఓటు వేయకుండా చెప్పకనే చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఆయనకే ఓటు వేసి గెలిపించారంటే అది ఆయనపైన ఉన్న ప్రేమ కాదు, జగన్ పై ఉన్న వ్యతిరేకతే.
మంచి చేసినా వ్యతిరేకత రావడం జగన్ దురదృష్టకరం, ఇప్పటికైనా డబ్బులు ఇస్తే చాలు గెలిచేస్తామనే భ్రమ నుంచి జగన్ బయటపడితే తప్ప మళ్లీ గెలిచే అవకాశాలు ఉండవు. డబ్బులు తీసుకున్నా అవి ఖర్చు కాగానే జనం మర్చిపోతారు. కళ్ళ ముందు ఏదైనా అభివృద్ధి జరిగిందని కనిపిస్తే తప్ప ప్రజలకు ఓటు వేయాలనే ఆలోచన రాదు. పేదలకు, బడుగు బలహీన వర్గాలకు, అన్ని కులాల వారికి మంచి చేయడం, న్యాయం చేయడం కోసం జగన్ పాటుపడ్డారు కానీ అభివృద్ధి చూపించడంలో ఫెయిల్ అయ్యారు. కనీస మౌలిక సదుపాయాలను డెవలప్ చేయడంలో కూడా ఫెయిల్ అయ్యారు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కూడా చేయలేకపోయారు.
చెత్త పన్నులు వసూలు చేయడం, నిత్యవసర సరుకుల ధరలు పెంచడం, పవర్ టారీఫ్‌లు ఇంక్రీస్ చేయడం ద్వారా వ్యతిరేకతను మూట కట్టుకున్నారు. ఇక మద్యం పాలసీ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. జగన్ కింద స్థాయి నేతలు ఇసుక, ల్యాండ్ మాఫియాలకు తెరలేపారు. దీనిని అరికట్టడంలో జగన్ విఫలమయ్యారు. పోలవరం ప్రాజెక్టు కట్టలేదు. రాజధానిని కూడా ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు సరిగా జీతాలు ఇవ్వకుండా వారి నుంచి కూడా వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఎంత మంచి చేసినా ప్రజలు పైన చెప్పినట్లే తప్పులు చేస్తే చివరికి వెన్నుపోటు పొడుస్తారని మరోసారి నిరూపితమైంది. మరి జగన్ హయాంలో చూడని అభివృద్ధిని చంద్రబాబు హయాంలోనైనా ఏపీ ప్రజలు చూడగలుగుతారా?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: