ఖాళీ ప్లేట్లతో కౌంటింగ్ సిబ్బంది ఆందోళన.. టిఫిన్ కూడా పెట్టలేదని నిరసన

Suma Kallamadi
ఎన్నికలను సజావుగా నిర్వర్తించేందుకు అధికారులు, సిబ్బంది, భద్రతా దళాలు, పోలీసులు ఎంతో నిబద్ధతతో వ్యవహరిస్తారు. దేశంలో అక్కడక్కడా చెదురుముదురు ఘటనలు జరిగినా, వారు ఎంతో సంయమనంతో వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఎన్నికల విధుల్లో ఉన్న వారు వడదెబ్బ కారణంగా చాలా మంది చనిపోతున్నారు. అయినప్పటికీ రాజ్యాంగ బద్ధంగా ఎన్నికల నిర్వహణకు కంకణం కట్టుకుని వారు తమ అసౌకర్యాలను పక్కనపెట్టి విధుల్లో పాల్గొంటున్నారు. ఇలాంటి వారికి కనీస సౌకర్యాలు కల్పించడం అనివార్యం. 

ఒక్కసారి కౌంటింగ్‌ కేంద్రం లోపలికి వెళితే బయటకు రాని పరిస్థితి ఉంటుంది. కనీసం ఉదయం టిఫిన్ అయినా చేయకపోతే వారంతా విధులు నిర్వహించ లేరు. ఊపిరి పీల్చుకోలేనంతగా పని ఒత్తిడి ఉంటుంది. ఈ తరుణంలో ఏపీలో ఎన్నికల కౌంటింగ్‌లో పాల్గొన్న కొందరు సిబ్బంది తమనకు కనీసం టిఫిన్ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం భోజనం చేసే పరిస్థితి ఉండదని, కనీసం ఉదయం టిఫిన్ కూడా తమకు పెట్టకపోతే ఎలా అని వాపోతున్నారు. తాము స్పృహ తప్పి పడిపోతే ఎవరు బాధ్యులని ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఏపీలో ఎన్నికలు పలు చోట్ల ఘర్షణ వాతావరణంలో జరిగినా, ఉద్యోగులు ఎంతో సంయమనంతో వ్యవహరించారు. మాచర్లలో ఎన్నికల సిబ్బంది ముందే వైసీపీ ఎమ్మెల్యే ఈవీఎంను ధ్వంసం చేశారు. అయినా ఉద్యోగులు ఘర్షణకు దిగలేదు. అయితే ప్రస్తుతం ఎన్నికల కౌంటింగ్ ఎంతో పకడ్బందీగా జరుగుతోంది. ఇలాంటి తరుణంలో ఏపీలోని అన్నమయ్య జిల్లాలో కౌంటింగ్ సిబ్బందికి ఊహించని పరిణామం ఎదురైంది. శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాల కౌంటింగ్ హాల్ వద్ద సిబ్బంది ఆందోళన చేశారు.

తమకు టిఫిన్ కూడా పెట్టకపోతే విధులు ఎలా నిర్వర్తించాలని ప్రశ్నించారు. తమలో కొందరు డయాబెటిస్ పేషెంట్లు ఉంటారని, వారు అస్వస్థతకు గురైతే ఎవరిది బాధ్యత అని నిలదీశారు. చేతుల్లో ఖాళీ ప్లేట్లతో ఆందోళన చేపట్టారు. ఇలాంటివి తమ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని, ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలని అధికారులను కోరుతున్నారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కౌంటింగ్ సిబ్బందికి తగిన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఆ కౌంటింగ్ కేంద్రానికి చెందిన ఆర్వోకు ఉంటుంది. ఆయనకు ఎన్నికల కమిషన్ నిధులు కూడా కేటాయిస్తుంది. సిబ్బందికి ఫుడ్‌కు నిర్దేశిత మొత్తాన్ని ఆర్వోలకు ఎన్నికల కమిషన్ నుంచి నిధులు అందుతాయి. అయితే సమయానికి వారికి కనీసం టిఫిన్ కూడా పెట్టకపోవడం అందరినీ నివ్వెరబోయేలా చేస్తోంది. సిబ్బంది పట్ల అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించకూడదని పలువురు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: