టెలి కాన్ఫరెన్స్ లో కీలక సూచనలు చేసిన చంద్రబాబు...?

Suma Kallamadi
దేశవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తైంది. ఈవీఎంలలోని ఫలితాలు ఒక్కొక్కటిగా విడుదల అవుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోంది. ఎంతో ఉత్కంఠగా జరిగిన ఈ ఎన్నికలలో గెలించేందుకు వైసీపీ, మరో వైపు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కూడా సర్వశక్తులూ ఒడ్డాయి. ఈ తరుణంలో గెలుపును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ అధినేత కౌంటింగ్‌కు ముందు కీలక నిర్ణయం తీసుకున్నారు. కౌంటింగ్‌లో పాల్గొనే ఏజెంట్లతో ఆయన కౌంటింగ్‌కు ముందే టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో కీలక సూచనలు చేశారు. కౌంటింగ్ సమయంలో పాటించాల్సిన విధానాలు, ఓట్ల లెక్కింపు విషయంలో ఏవైనా అనుమానాలు వస్తే చేయాల్సిన పనులు, అధికారులతో సమన్వయం వంటి అంశాలపై ఆయన కీలక సూచనలు చేశారు. దీంతో తమ పార్టీ కౌంటింగ్ ఏజెంట్లను సంసిద్ధం చేసి ఓట్ల లెక్కింపు కేంద్రాలకు పంపించారు. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
ప్రస్తుత ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. జనసేన, బీజేపీతో జట్టు కట్టారు. దీని కోసం టీడీపీ కొన్ని సీట్లు కోల్పోయినా, తన పార్టీ నేతలకు ఆయన సర్ది చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని హామీనిచ్చారు. కూటమిలోని పార్టీలతో సమన్వయం చేసుకుని అభ్యర్థులను బరిలోకి దించారు. ఎన్నికలు పూర్తయ్యాక ఎగ్జిట్ పోల్స్‌లో సైతం కూటమి పార్టీలకే ఆధిక్యం దక్కింది. ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే ఇప్పుడు మరో ఎత్తు.

కౌంటింగ్ సమయంలో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఫలితం తేడా కొట్టే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్‌కు తన ఏజెంట్లను పకడ్బందీగా చంద్రబాబు సిద్ధం చేశారు. మంగళవారం ఉదయం 5 గంటలకే కౌంటింగ్ ఏజెంట్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో బీజేపీ నుంచి పురంధేశ్వరి, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, కూటమి పార్టీల కౌంటింగ్ ఏజెంట్లు పాల్గొన్నారు. వారిని ఉద్దేశించి చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. కౌంటింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని, ఓట్ల లెక్కింపులో ఏవైనా అనుమానాలు వస్తే వెంటనే ఆర్వోను సంప్రదించాలన్నారు. వారికి ఫిర్యాదు చేయాలని సూచించారు. కౌంటింగ్ సమయంలో ఏజెంట్లు సహనంగా ఉండాలని చెప్పారు. ఐదేళ్లు సంయమనంతో ఉన్నామని దాని ఫలితం కొన్ని గంటల్లో రానుందని పేర్కొన్నారు. కౌంటింగ్‌లో అన్ని రౌండ్లు పూర్తయ్యే వరకు ఏజెంట్లు బయటకు రాకూడదని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: