ఏపీలో జగన్, బాబు కౌంటింగ్ స్ట్రాటజీ.. ఎవరి అంచనాలు నిజమవుతాయో?

Suma Kallamadi
ఏపీలో ప్రస్తుతం జరిగిన ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికల్లో కూటమి గెలుస్తుందని కొన్ని సర్వేలు, వైసీపీ మరోసారి అధికార పీఠం దక్కించుకుంటుందని మరికొన్ని సర్వే సంస్థలు వెల్లడించాయి. అయితే ఎవరికి వారు గెలుపు తమదంటే తమదంటూ చాలా నమ్మకంగా ఉన్నాయి. ఇక ఎన్నికల తర్వాత విదేశీ పర్యటనకు వెళ్లిన సీఎం జగన్ తిరిగి ఏపీకి పయనమయ్యారు. శుక్రవారం రాత్రి ఆయన లండన్‌లో బయలుదేరారు. గన్నవరం ఎయిర్‌పోర్టుకు శనివారం తెల్లవారుజామున 4 గంటలకు చేరుకున్నారు. 

అనంతరం ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా ఆయన తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. దాదాపు రెండు వారాల పాటు ఆయన రాష్ట్రానికి దూరంగా ఉన్నారు. ఈ సమయంలో జరిగిన పరిణామాలపై ఆయన సమీక్షించనున్నారు. ముఖ్యమైన పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం కోర్టులో ఉన్న పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై ముఖ్యులతో చర్చించనున్నారు. దీనిపై శనివారం ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో సమాలోచనలు చేయనున్నారు. ఇదే సమయంలో తన వద్ద ఉన్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాల సరళిని కూడా పార్టీ పెద్దలు, ముఖ్యులతో పంచుకోనున్నారు. ముఖ్యంగా 3 రోజుల్లో ఫలితాలు వెలువడనున్న తరుణంలో ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. కౌంటింగ్ సంయంలో వైసీపీ నేతలు పాటించాల్సిన జాగ్రత్తలను ఆయన స్వయంగా చెప్పనున్నారు.
మరో వైపు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అమెరికాకు వెళ్లారు. ఆయన కూడా శనివారం రాష్ట్రానికి రానున్నారు. ఎయిర్‌పోర్ట్ నుంచి ఉండవల్లిలోని నివాసానికి చేరుకుంటారు. ఇదే తరుణంలో కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టీడీపీ వర్క్ షాప్‌లు నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి చంద్రబాబు నేరుగా కొన్ని సూచనలు చేసే అవకాశం ఉంది. కూటమి పార్టీల ముఖ్య నేతలు, సొంత పార్టీ నేతలతో సైతం ఆయన వరుస సమావేశాలు నిర్వహించే వీలుంది.

 ముఖ్యంగా కౌంటింగ్ స్ట్రాటజీపై వారితో చంద్రబాబు చర్చించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కీలక అంశంగా మారిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో పార్టీ నేతలు, కూటమి నాయకులతో ఆయన కీలక చర్చలు జరపనున్నారు. ఎన్నికల్లో తాము ఖచ్చితంగా గెలుస్తామని చంద్రబాబు భావిస్తున్నారు. పార్టీ నేతలు సైతం ఈ విషయంలో ధీమాగా ఉన్నారు. తమ వద్ద ఇందుకు సంబంధించి ఎగ్జిట్ పోల్స ఫలితాలు కూడా ఉన్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ తరుణంలో మరో మూడు రోజుల్లో కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చంద్రబాబు నేరుగా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనుంది. విదేశీ పర్యటనలకు వెళ్లిన వైసీపీ, టీడీపీ అధినేతలు ఒకే రోజు స్వదేశానికి రావడం, పార్టీ నాయకులతో కీలక సమావేశాలు చేపడుతుండడం ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: