కడప జిల్లాలో సంచలనం.. వారికి జిల్లా బహిష్కరణ?

Suma Kallamadi
సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా కడప ఆయనకు తొలి నుంచి బలమైన మద్దతు ఇస్తోంది. వైఎస్ఆర్‌సీపీ ప్రారంభించినప్పటి నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కంటే ఇక్కడ ఆయనకు, ఆయన పార్టీకి ఏకపక్షమైన మెజార్టీ లభిస్తోంది. అలాంటి జిల్లాలో ప్రస్తుతం రాజకీయంగా ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో అంటే జూన్ 4న ఎన్నికల ఫలితాలు రానున్నాయి. వీటి కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పోలింగ్ సందర్భంగా రాష్ట్రంలో తలెత్తిన ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు రిపీట్ అవకుండా అధికారులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. 

అధికారులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించినట్లు టీడీపీ ఆరోపించింది. టీడీపీ వారికే అధికారులు, పోలీసులు మద్దతుగా నిలిచారని వైసీపీ విమర్శించింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘానికి అధికారులపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో కడప జిల్లాలో కలెక్టర్, ఎస్పీ కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఏపీలోని మాచర్ల, తిరుపతి, గురజాల, నరసరావుపేట, తాడిపత్రలో ఘర్షణల తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో అధికారులు సీరియస్‌గా పని చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రౌడీ షీటర్ల విషయంలో జిల్లా అధికారులు తీసుకున్న చర్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.
ఎన్నికల సమయంలో రౌడీషీటర్ల వల్ల ఉద్రిక్తతలు, ఘర్షణలు తలెత్తే అవకాశం ఉంది. దీంతో కొన్ని కీలక సందర్భాల్లో వీరికి జిల్లా బహిష్కరణ విధిస్తారు. ముఖ్యంగా రాయలసీమలోని చంద్రగిరిలో తలెత్తిన ఘర్షణలతో దేశం మొత్తం ఏపీ వైపు చూసింది. ఇక కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అప్పటి నుంచి ప్రతి అధికారి బాధ్యతగా పని చేయడం ప్రారంభించారు. ఎప్పటి కప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ సొంత జిల్లాలో 21 మంది రౌడీ షీటర్లను జిల్లా నుంచి అధికారులు బహిష్కరించారు. మరో 32 మందిని గృహ నిర్బంధంలో ఉంచాలని జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు.

మే 31 నుంచి వారం రోజుల పాటు జిల్లాకు సంబంధించిన రౌడీ షీటర్లను బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా ఇది సీఎం జగన్ సొంత జిల్లా కావడంతో అధికారులు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా చర్చ సాగుతోంది. ఇప్పటి వరకు ఏదో ఒక పార్టీకి అనుకూలంగా అధికారులు వ్యవహరించారనే పేరు ఉంది. ఈ తరుణంలో అధికారులు ఒక్కసారిగా బాధ్యతగా వ్యవహరిస్తూ కేవలం ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తున్నారు. రౌడీషీటర్లు సాధారణంగా ఏదో ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించే వీలుంది. అయినప్పటికీ ఒత్తిళ్లన్నీ పక్కనపెట్టి వారిని జిల్లా నుంచి అధికారులు బహిష్కరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: