వైసీపీకి ఎంతో కావాల్సిన ఐఏఎస్ ఆఫీసర్.. సడన్‌గా దూరం ఎందుకు..??

Suma Kallamadi
వైసీపీ అధినేత , ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి చాలామంది సివిల్ సర్వీస్ ఆఫీసర్లు సహాయం చేశారు. వారి సహకారంతోనే జగన్ గడిచిన ఐదేళ్లలో గొప్ప పరిపాలన అందించగలిగారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ద్వారా లబ్ధి పొందిన ఆఫీసర్లు జగన్‌కు అండదండగా ఉంటూ తమ రుణం తీర్చుకుంటున్నారు. అలాంటి వారిలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి కె.ధనంజయరెడ్డి.జగన్‌కు కుడి భుజంగా ఉన్న సీనియర్‌ ఐఏఎస్ అధికారి కె.ధనంజయరెడ్డి మే 31వ తేదీన అంటే రేపే పదవీ విరమణ పొందుతున్నారు. ఈయన కడప జిల్లాకు చెందినవారు. ఈ అధికారిది 2006 ఐఏఎస్ బ్యాచ్‌. 2019లో జగన్ సీఎం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయనకు అదనపు కార్యదర్శిగా పనిచేస్తూ వచ్చారు. 2006లో ఐఏఎస్‌గా పదోన్నతి పొందారు. నిజానికి కె.ధనంజయరెడ్డి నాన్-కేడర్ స్టేట్ సివిల్ సర్వీస్ అధికారి. సాధారణంగా నాన్-కేడర్ అధికారులకు ఐఏఎస్ పదోన్నతి ఇవ్వరు కానీ ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి మద్దతు కారణంగా ఈ ప్రమోషన్ సాధ్యమైంది.
ఆ విధంగా మంచి పొజిషన్ పొందిన ధనంజయ రెడ్డి చాలా పలుకుబడి సంపాదించారు. ఆయన ఆమోదం లేకుండా సీఎం కార్యాలయంలో ఎలాంటి డాక్యుమెంట్స్ ప్రాసెస్ కూడా చేయరట. అంత ప్రభావవంతంగా మారారని రిపోర్ట్స్ తెలిపాయి. జగన్ తనకు పూర్తి అధికారం ఇచ్చినందున వివిధ శాఖల పరిధిలోని అధికారుల కేటాయింపులు, నియామకాలను నిర్ణయించేవారు.ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ప్రతి వ్యక్తికి సంబంధించిన సవివరమైన సమాచారం ఆయనకు అందుబాటులో ఉంది. అందువల్ల అభ్యర్థుల కేటాయింపు విషయంలో కూడా ఈయన పైనే జగన్ ఆధారపడ్డారు. అభ్యర్థుల ఎంపికపై ముఖ్యమంత్రి జరిపిన అన్ని చర్చల్లో ఆయన పాల్గొన్నారు.
1964, మే 10న జన్మించిన ధనంజయరెడ్డి, శుక్రవారం అంటే 2024, మే 31న సర్వీసు నుంచి పదవీ విరమణ చేయనున్నారు. ధనంజయరెడ్డి సర్వీసు ఎక్స్‌టెన్షన్ కోరలేదని సమాచారం. ఒకవేళ సర్వీస్‌ను ఎక్స్‌టెండ్ చేయమంటే జగన్ కళ్ళు మూసుకొని మంజూరు చేసి ఉండేవారు. ఎక్స్‌టెన్షన్ కోరినట్లయితే, అది ఇప్పటికే మూడు నెలల క్రితమే ప్రాసెస్ అయి ఉండేది. అయితే, వ్యక్తిగత కారణాల వల్ల, ధనంజయ్ రెడ్డి ఎక్స్‌టెన్షన్ అడగకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ఏపీ అసెంబ్లీ ఫలితాల ప్రకటనకు మూడు రోజుల ముందు నిశ్శబ్దంగా సర్వీసు నుంచి రిటైర్ అవుతున్నారు.
 తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వస్తే తనకు సర్వీసులో స్థానం ఉండదని, చంద్రబాబు నాయుడుకు టార్గెట్‌గా మారే అవకాశం ఉందని ధనంజయరెడ్డికి తెలుసు. అందుకే ఆయన పదవీ విరమణను పెంచుకొని ఉంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే, ధనంజయరెడ్డికి సీఎంకి ప్రధాన సలహాదారుగా లేదా మరేదైనా కీలక పదవిలో వేరే అవకాశం రావచ్చు. ఆయన రాజకీయాల్లోకి వచ్చి రాజ్యసభ సభ్యత్వం తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదని సన్నిహితులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: