ఏపీ: రౌడీయిజంగా మారిన రాజకీయం.!

Pandrala Sravanthi
అప్పుడెప్పుడో కోట గారు ఓ చిత్రంలో డైలాగ్ కొట్టారు. "రాజకీయం రౌడీయిజం ఒక్కటి కావు" అని.. కానీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు చూస్తే మాత్రం  రాజకీయాలకు విపరీతమైన రౌడీయిజాన్ని పులుముతున్నారని చెప్పుకోవచ్చు. ఎన్నికలు జరిగినప్పటి నుంచి  రాష్ట్రవ్యాప్తంగా  ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది.  మొన్నటికి మొన్న  ఒక ఎమ్మెల్యే పోలింగ్ బూత్ లో ఓ వ్యక్తిని కొట్టడం, అలాగే మరికొన్ని ప్రాంతాల్లో  ఓట్లు వేసిన వ్యక్తులను కూడా కొట్టడం ఇలా అనేక ఘటనలు చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న ఈ పరిస్థితులు చూసి ప్రజలు విపరీతంగా భయపడుతున్నారట.  ఇప్పుడే ఇలా ఉంటే కౌంటింగ్ తర్వాత పరిస్థితులు ఏ విధంగా మారుతాయో అని  ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది.  సాధారణంగా 5, 10 సంవత్సరాలు పాలించిన  ఏ ప్రభుత్వమైనా మారడం  సర్వసాధారణమే. 

కానీ ఏపీలో మాత్రం   ప్రభుత్వాలు మారడం అభ్యర్థుల ఓటములను అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తే ప్రత్యర్థి పార్టీ వ్యక్తులను ఆర్థికంగా దెబ్బతీయడం, లేదంటే వారిని పూర్తిగా అంతం చేయడం వంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పార్టీల నాయకులు పోటీ చేసి ఓడిపోయారంటే  చాలు వారు భయంతో చచ్చిపోతున్నారు. ఈ విధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా  కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతూ  అధికారమే లక్ష్యంగా చేసుకుంటూ ఎలాంటి పనులు చేయడానికి అయినా వెనకాడడం లేదు. ప్రస్తుతం ఏపీలో రెండు ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఇన్నాళ్లు అధికారంలో ఉన్న వైసిపి  టిడిపి అధికారంలోకి వస్తే మనల్ని ఉంచుతుందా, ఐదేళ్లలో మన పని అయిపోయినట్టే అని భయంతో చస్తున్నారు.  అలాగే ఇక టిడిపి పార్టీ నాయకులేమో  జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చారంటే మన పని అయిపోయినట్టే  మరోసారి పోటీకి కూడా పనికి రాకుండా చేస్తారని భయంతో ఉన్నారు.

కానీ ఎవరు కూడా రాజకీయాల్లో గెలుపోటములు సహజమే ఓడినా, గెలిచినా ప్రజల్లో ఉందాం  అని అస్సలు భావించుకోవడం లేదట. ప్రస్తుతం పరిస్థితులు చూస్తే మాత్రం భవిష్యత్తులో  రాష్ట్రమంతా సర్వనాశనం చేయడానికి ఈ రాజకీయ నేతలే కారకులు అవుతారని సామాన్య జనాలు చర్చించుకుంటున్నారు.  కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే ఎన్నికలు జరగడం లేదు కదా మొన్నటికి మొన్న తెలంగాణలో జరిగాయి. కాంగ్రెస్ గెలిచింది  కానీ అక్కడ బీఆర్ఎస్ నాయకులు ఇంతలా ప్రవర్తించలేదు కదా. అలాగే 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉంది  కాంగ్రెస్ నాయకులు కూడా ఈ విధంగా ఎక్కడ చేయలేదు కదా అంటూ ఓ వైపు వైసీపీని మరోవైపు టిడిపిని తిట్టిపోసుకుంటున్నారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే మాత్రం  రాబోవు తరాలకు  రాజకీయాలు ఏమో కానీ రౌడీయిజం నేర్పే పరిస్థితులు ఏర్పడతాయని ప్రజలు అనుకుంటున్నారట. మరి చూడాలి రాబోవు కాలంలో అయినా రాజకీయాల్లో మార్పు వస్తుందా లేదంటే ఇంకా పెరుగుతుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: