జగన్ ను ఆరోజు చూసుకుందాం.. ఘాటుగా స్పందించిన పీకే..

Suma Kallamadi
ఏపీలో ఎంతో ఉత్కంఠ రేపిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీలకు వాగ్యుద్ధం తీవ్ర స్థాయిలో జరిగింది. అయితే తాజాగా వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్‌కు సరికొత్త సవాల్ వచ్చింది. అది ఎవరి నుంచో కాదు. 2019లో వైసీపీ అఖండ విజయానికి దోహదపడిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో జగన్‌కు సవాల్ విసిరారు. జగన్ ఘోర ఓటమిని చవిచూడనున్నారని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ఇదే తరహా వ్యాఖ్యలు ఆయన చేశారు. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత ఐ ప్యాక్ టీమ్‌తో జగన్ భేటీ అయ్యారు. ఐ ప్యాక్ టీమ్ పనితీరును మెచ్చుకున్నారు. పనిలోపనిగా 2019లో పీకే గెలిపించిన స్థానాల కంటే ఎక్కువగా వైసీపీ 2024లో గెలవబోతుందంటూ జోస్యం చెప్పారు. అయితే తాజాగా ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్యలపై స్పందించారు. జగన్‌పై ఆయన విరుచుకుపడ్డారు. జూన్ 4న ఏం జరుగుతుందో చూద్దామంటూ సవాల్ విసిరారు. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
ప్రశాంత్ కిషోర్‌తో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ బర్కాదత్ ఇంటర్వ్యూ చేశారు. తన యూట్యూబ్ ఛానల్‌లో దానిని ప్రసారం చేశారు. అందులో ప్రశాంత్ కిషోర్ ఏపీ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2024లో జగన్ ఘోర ఓటమి చెందుతారని పేర్కొన్నారు. జగన్ ఓడిపోతున్నారని గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. అయితే జగన్ మాత్రం 2019 కంటే ఎక్కువ సీట్లు సాధించనున్నట్లు చెప్పారని బర్కాదత్ గుర్తు చేశారు. జగన్ అలా భావించడంలో తప్పేమీ లేదన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, బీహార్‌లో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సైతం ఇదే తరహా భావనలో ఉన్నారన్నారు.

చాలా మంది అభ్యర్థులు ఎన్నికల కౌంటింగ్‌లో నాలుగు రౌండ్లు పూర్తైనా, తమ ఓటమిని అంగీకరించలేరన్నారు. తామే గెలుస్తామని చివరి రౌండ్ వరకు భావిస్తారన్నారు. 2019లో కంటే 2024లో ఎక్కువ సీట్లు గెలుస్తామని జగన్ చెప్పినా, అలా జరిగేందుకు ఏ మాత్రం అవకాశం లేదని చెప్పారు. జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయని, తాను చెప్పింది నిజమవుతుందో లేదో అప్పుడే చూడాలని పేర్కొన్నారు. ఇక కేంద్రంలో మోడీ హవా కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నమాట వాస్తవం అన్నారు. అయితే అది ఆగ్రహంగా మారలేదన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీకి దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు పెరిగే అవకాశం ఉందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: