రహస్యం: పోలింగ్ శాతం పెరగడం వెనుక అసలు సీక్రెట్‌ ఇదా?

Chakravarthi Kalyan
రికార్డు స్థాయిలో జరిగిన ఏపీ పోలింగ్ వేళ.. చోటు చేసుకున్న సిత్రాలకు కొదవ లేదు. దేశంలో మరెక్కడా లేని విధంగా 81 శాతానికి మించి పోలింగ్ నమోదు కావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అదే సమయంలో ఈ పోలింగ్ పై ఇప్పటికే చర్చ నడుస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఓట్లు వేయడం కోసం నాలుగైదు గంటలు సమయం వేచి చూసి మరీ ఓటేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అనేది కూడా చర్చనీయాశంగా మారింది.

అయితే పోలింగ్ సరళి ఎందుకు పెరిగింది అనే దానిపై మాత్రం కారణాలను ఎవరూ విశ్లేషించలేకపోతున్నారు. ఇది ప్రభుత్వ వ్యతిరేకత అని కొందరు భావిస్తుంటే.. వైసీపీకి మద్దతుగా జనం పోటెత్తారు అని మరికొందరు పేర్కొంటున్నారు.  ఏది ఏమైనా పోలింగ్ శాతం పెరగడం శుభ పరిణామమే అయినా.. ఎందుకు పెరిగింది అనే మీమాంస మాత్రం ఆయా రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లో ఉంది.

ముఖ్యంగా  ఈ సారి ఎన్నికల్లో దేశ విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున ఏపీ ప్రజలు వచ్చి ఓటింగ్ లో పాల్గొన్నారు. అయితే 2014లో, 2019లో పాల్గొనలేదా అంటే అప్పుడు వచ్చి ఓటేశారు. అప్పుడు రానీ చర్చ ఇప్పుడే ఎందుకు మొదలైంది అనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. అయితే పోలింగ్ శాతం పెరగడానికి ఓ కారణాన్ని ఓ బూత్ ఏజెంట్ చెప్పడం సహేతుకంగా అనిపించింది.

ఏపీలో ఎన్నికల ముందు ఓట్ల తొలగింపు వ్యవహారం ఎంత రచ్చకెక్కిందో మన అందరకీ తెలిసిందే. చాలా మంది ఓట్లు తొలగిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తే.. లేదు ఇక్కడ ఉన్న వారికి మాత్రమే ఉంచుతున్నాం అని వైసీపీ పేర్కొంది. మొత్తం మీద వాలంటీర్ల ద్వారా ఓట్ల ఏరివేత జరిగింది. అలా తొలగించడం వల్ల మిగిలిన ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరంతా ఎప్పుడూ ఓటేసేవారే. గతంలోను వచ్చారు. ఇప్పుడు వచ్చారు. కాకపోతే చనిపోయిన, రెండు ఓట్లు తొలగింపు వంటి వాటివల్ల పెరగిన పోలింగ్ అని ఓ బూత్ ఏజెంట్ వివరించారు. ఓ రకంగా చెప్పాలంటే ఇది కూడా నిజమే అనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: