కేటీఆర్ : ఆయన ప్రియమైన ప్రధాని కాదు... పిరమైన ప్రధాని..?

Pulgam Srinivas
మరి కొన్ని రోజుల్లో జరగనున్న తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలను పర్యటిస్తున్నారు అందులో భాగంగా తాజాగా మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని కర్మన్ ఘాట్ లో జరిగిన రోడ్ షో లో పాల్గొన్న ఆయన భారతీయ జనతా పార్టీపై మోడీపై తనదైన రీతిలో విమర్శలు చేశారు. తాజా రోడ్ షోలో భాగంగా కేటీఆర్ మాట్లాడుతూ... ఏమయ్యా మోడీ దేశానికి, హైదరాబాద్ కు ఏం చేసినవ్ అంటే చెప్పటానికి ఏమీ లేదు. హైదరాబాద్ కు వరదలు వస్తే ఒక్క పైసా ఇయ్యలేదు.

గుజరాత్ కు వరదలు వస్తే వెయ్యి కోట్లు ఇచ్చిండు. మనకు మాత్రం రూపాయ్ ఇవ్వలే. ఐటీఐఆర్ రద్దు చేసిండు. మనకు చేయూత ఇవ్వమంటే ఉన్నది కూడా గుంజుకున్నాడు. బీజేపీకి ఓటు ఎందుకు వేయాలంటే మేము గుడికట్టిన ఓటు వేయాలే అంటున్నారు. గుడి కట్టుడు ఒక్కటే ఓటు వేసేందుకు కారణమైతే కేసీఆర్ కట్టలేదా యాదాద్రి. దేవున్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నామా? కేసీఆర్ గారు కాళేశ్వరం లాంటి ఆధునిక దేవాలయం కట్టిండు. రిజర్వాయర్లు , చెరువులను పూర్తి చేసిండు. వాటికి కూడా దేవుళ్ల పేర్లు పెట్టిండు.

ఒక్క ఆలయం కట్టినందుకే మోడీకి ఓటు వేస్తే...మరి యాదాద్రితో పాటు ఆధునిక దేవాలయాలు కట్టినందుకు కేసీఆర్ ఓటు వేయొద్దా? పప్పు, ఉప్పు చింతపండు ధరలు పెరిగినయ్. అందుకే ప్రధానిని ప్రియమైన ప్రధాని కాదు. పిరమైన ప్రధాని అంటున్నారు. మోడీ ప్రధాని అయినప్పటికి ఇప్పటికీ క్రూడ్ ఆయిల్ ధర 16 డాలర్లు తగ్గింది. మరి క్రూడ్ ఆయిల్ ధర తగ్గిన తర్వాత కూడా పెట్రోల్, డిజీల్ ధరలు ఎందుకు పెరిగినయ్. ప్రజల ముక్కు పిండి రాష్ట్రాలకు వాటా దక్కకుండా సెస్ వేసి రూ. 30 లక్షల కోట్లు వసూలు చేసిండు. ఏం చేసినవయ్యా ఆ పైసలు అంటే జాతీయ రహదారులు కట్టినా అంటాడు.

మరి టోల్ ఎందుకు ఎందుకు వసూల్ చేసివంటే చెప్పడు. రూ. 30 లక్షల కోట్ల నుంచి అదానీ, అంబానీ లాంటి పారిశ్రామిక వేత్తలకు రూ. 14 లక్షల కోట్లు రుణమాఫీ చేసిండు. నేను చెప్పింది అబద్దమైతే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. పదేళ్లు ప్రధానిగా పనిచేసినోళ్లు దేవుని పేరుతో రాజకీయాలు చేస్తారా ఏం అభివృద్ధి చేసినవో చెప్పి ఓటు అడగాలె. బీజేపీకి ఓటు వేస్తే హైదరాబాద్ ను యూటీ చేస్తారు. హైదరాబాద్ ను ఖచ్చితంగా లూటీ చేస్తారు.

దీన్ని అడ్డుకోవాలంటే పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఉండాలె. గతంలో ఐదు సీట్లతో తెలంగాణను ఎట్ల సాధించినమో.. అట్ల 10-12 సీట్లు ఇస్తే తెలంగాణ రాజకీయాలను శాసించే పరిస్థితి వస్తది. సుధీర్ అన్నకు ఇచ్చినట్లే రాగిడి లక్ష్మారెడ్డి ని కూడా గెలిపించండి అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: